Share News

Budget Speech: అందరూ పాల్గొనాలి

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:29 AM

బడ్జెట్‌ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వ ప్రాథమ్యాలకు ప్రతిబింబమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థిక పరమైన నమూనా అని పేర్కొన్నారు.

Budget Speech: అందరూ పాల్గొనాలి

ఫ్యూచర్‌ సిటీని దేశంలోనే తొలి నెట్‌ జీరో సిటీగా మార్చడానికి 7 మండలాలు, 56 గ్రామాల్లోని 765 చదరపు కి లోమీటర్ల విస్తీర్ణంతో అథారిటీని ఏర్పాటు చేశాం. 2029-30 నాటికి రాష్ట్రంలో 6 వేల ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. - గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • అసెంబ్లీకి సభ్యులందరూ రావాలి.. బడ్జెట్‌పై చర్చలో పాలుపంచుకోవాలి

  • బడ్జెట్‌ అంకెల కూర్పు మాత్రమే కాదు.. భవిష్యత్తుకు ప్రతిబింబం

  • పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు.. అందరికీ అభివృద్ధి ఫలాలు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ సంకల్పం దృఢ మైనది

  • దేశానికే ఆదర్శంగా రాష్ట్రం.. చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు

  • బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. చప్పట్లతో సమర్థించిన

  • సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌ సభ్యులు.. వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నినాదాలు

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వ ప్రాథమ్యాలకు ప్రతిబింబమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థిక పరమైన నమూనా అని పేర్కొన్నారు. శాసనసభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, బడ్జెట్‌పై చర్చలో శ్రద్ధాసక్తులతో పాల్గొనాలని సూచించారు. బడ్జెట్‌ చర్చలు రేపటి ఆర్థిక ఇబ్బందులను నివారిస్తాయని, కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ.. ప్రతీ కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయనేది గుర్తించాలని అన్నారు. బుధవారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. 33 నిమిషాలపాటు 66 అంశాలపై బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. గవర్నర్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలం కాబోతోందన్నారు. ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానం, సామాజిక న్యాయంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవనుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిలా ఉండే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్తును రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. యువ, డైనమిక్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢ మైనదని అన్నారు.


ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది కాలంలోనే 55 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్‌ అన్నారు. క్రీడల్లో గ్లోబల్‌ లీడర్‌గా రాష్ట్రానికి హోదా కల్పించడానికి, ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడానికి యంగ్‌ ఇండి యా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ స్పోర్స్‌ యూనివర్సిటీని, యువతకు సాధికారత కల్పించడానికి యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సివిల్‌ సర్వీసు ఆశావహులకు రూ.లక్ష సాయం అందిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించడానికి ట్రైబ్యునల్‌లో బలమైన వాదలను వినిపిస్తున్నామని తెలిపారు. రైతులకు ఆసరాగా ఉండేందుకు వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ కింద మొత్తం రూ.1,206.44 కోట్లను అందించామన్నారు. రూ.2 లక్షల దాకా పంట రుణమాఫీ కింద 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్లు అందించామని చెప్పారు. ఇక ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీని దేశంలోనే తొలి నెట్‌ జీరో సిటీగా మార్చడానికి 7 మండలాలు, 56 గ్రామాల్లోని 765 చదరపు కి లోమీటర్ల విస్తీర్ణంతో అథారిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు. 2029-30 నాటికి రాష్ట్రంలో 6 వేల ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జౌళి పరిశ్రమను పటిష్ఠపరచడానికి మరమగ్గాలు, నేతకార్మికుల అభ్యున్నతి కోసం వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్‌ డిపోను ఏర్పాటు చేశామని తెలిపారు. స్వయంసహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు అందిస్తున్నట్లు తెలిపారు.


ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు..

ఎస్సీ కులాల వర్గీకరణ కోసం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకూ బిల్లును ప్రతిపాదిస్తున్నామన్నారు. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు, రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ రూ.10 లక్షలకు పెంపు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను గవర్నర్‌ వివరిస్తున్నప్పుడు.. సమర్థనగా సీఎం రేవంత్‌రెడ్డి బల్లను చరచగా.. అధికార పార్టీ సభ్యులు చప్పట్లతో స్వాగతించారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు గవర్నర్‌ ప్రసంగం ఆసాంతం వ్యతిరేక నినాదాలు చేశారు. సభలో కేసీఆర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా పలకరించారు. అంతకుముందు గవర్నర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తోడ్కొని వచ్చారు. కాగా, గవర్నర్‌ ప్రసంగం సకలజనుల సంక్షేమాన్ని, సమస్త రంగాల అభివృద్ధిని నిజాయితీగా, నిష్పాక్షికంగా ప్రజాకోణంలో వెల్లడించిందని సీఎం రేవంత్‌రెడ్డి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.


45 నిమిషాల ముందే అసెంబ్లీకి కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ 45 నిమిషాల ముందే అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్దకు చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. బీఆర్‌ఎ్‌సఎల్పీ చాంబర్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. తన సోదరుడి కుటుంబంలో జరిగే పెళ్లికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Mar 13 , 2025 | 04:29 AM