Bhatti Vikramarka: రంగస్థల కళాకారులకూ అవార్డులు
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:40 AM
సినీ కళాకారుల మాదిరిగానే రంగస్థల కళాకారులకూ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగ పోటీలను నిర్వహించి ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
భక్తరామదాసు కీర్తనలు మార్గదర్శకం: మల్లు భట్టివిక్రమార్క
బర్కత్‌పుర, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సినీ కళాకారుల మాదిరిగానే రంగస్థల కళాకారులకూ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగ పోటీలను నిర్వహించి ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. భక్తరామదాసుకు శ్రీరాముడిపై ఉన్న భక్తి, ఆయన పాడిన కీర్తనలు నేటి తరానికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. సంగీత కళాకారులు రామదాసును స్ఫూర్తిగా తీసుకుని ప్రముఖ విద్వాంసులుగా పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. ఆదివారం ఎల్‌బి ఇండోర్ స్టేడియంలో భక్తరామదాసు 392వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా భక్తరామదాసు జయంతి వేడుకలను ప్రతియేటా అధికారికంగా నిర్వహించి సంగీత నాట్యకళాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భక్తరామదాసు ఆలియాస్ కంచర్ల గోపన్న పుట్టి పెరిగిన జిల్లాలోనే తాను జన్మించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భక్తరామదాసు గొప్ప వ్యక్తి అని, ఎన్ని కష్టాలు ఎదురైన శ్రీరాముడిపై తనకు ఉన్న భక్తిని చాటిచెప్పి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.