Egg Supply Tender: గుడ్ల టెండర్లలో నచ్చిన ధరలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:51 AM
కోడి గుడ్ల సరఫరా టెండర్లలో సర్కారు నిబంధనలను కొంత మంది కలెక్టర్లు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది.
వెల రూ.6.3కి మించొద్దన్న ప్రభుత్వం
పట్టించుకోని కొందరు కలెక్టర్లు
పాలమూరు, సంగారెడ్డి, వికారాబాద్ ఆదిలాబాద్‌లో ఎక్కువకు కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కోడి గుడ్ల సరఫరా టెండర్లలో సర్కారు నిబంధనలను కొంత మంది కలెక్టర్లు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో ఒక గుడ్డు ధర రూ.6.30కి మించొద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా.. కొందరు కలెక్టర్లు పట్టించుకోలేదు. ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో తెరచిన టెండర్లను పరిశీలిస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.6.40.. వికారాబాద్, సంగారెడ్డిలో రూ.6.39.. ఆదిలాబాద్‌లో రూ.6.36, నాగర్‌కర్నూల్‌లో రూ.6.35 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కామారెడ్డిలో రూ.6.15, ములుగులో రూ.6.23.. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాలలో రూ.6.25, జనగామ జిల్లాలో రూ.6.28 చొప్పున కాంట్రాక్టర్లు టెండరు దక్కించుకున్నారు.
డీపీసీలకు టెండర్ల బాధ్యతలు..
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు గుడ్ల సరఫరా కోసం ఇటీవల ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై మధ్యాహ్న భోజన పథకం మినహా.. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు అన్ని రకాల గురుకులాలు, కేజీబీవీలు, వసతి గృహాలకు కలిపి టెండర్లు నిర్వహించుకోవాలని పేర్కొంది. కలెక్టర్ చైర్మన్‌గా.. విద్యా, సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండే జిల్లా కొనుగోలు కమిటీ(డీపీసీ)లకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది సెప్టెంబరు ఒకటి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ప్రతి నెలా 5.38 కోట్ల గుడ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడానికి గత నెలలోఈ- ప్రొక్యూర్‌మెంట్ టెండర్ నోఫికేషన్‌ను సర్కారు జారీ చేసింది. ఆయా జిల్లాల కొనుగోలు కమిటీలు ఈ నెల 21 వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కాంట్రాక్టర్లు గుడ్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టం వచ్చిన ధరలు కోట్ చేయకుండా ఉండటానికి గుడ్డు ధర రూ.6.30కి మించొద్దనే షరతు విధించింది. అయితే.. కొన్ని జిల్లాల్లో కొనుగోలు కమిటీలు దీనిని అతిక్రమించాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. డీపీసీలు జిల్లాల వారీగా ఇప్పటికే టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఇంతవరకు టెండర్ ఊసేలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News