లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ సర్కారు నజర్
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:55 AM
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కారు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా పునర్విభజన జరగాలనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

అఖిలపక్ష భేటీలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం
డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డికి బాధ్యత
జానారెడ్డితో సీఎం భేటీ మర్మమూ ఇదే
హైదరాబాద్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కారు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగింది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా పునర్విభజన జరగాలనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వ పరంగా అఖిలపక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించాలని సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరిగితే.. కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివిధ వేదికలపై సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గురువారం క్యాబినెట్‌లోనూ చర్చించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం తగ్గనున్నందున ఈ విధానాన్ని నిరసిస్తూ అఖిలపక్ష సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు.
ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది ఈ సమావేశాల్లో తీర్మానించి కేంద్రానికి పంపనున్నారు. తొలి సమావేశం త్వరలో హైదరాబాద్‌లోనే జరగనుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రకటించారు. కాగా, జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్లో నిర్ణయించడానికి ముందు.. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని పార్టీలను, పక్షాలను ఒక తాటిపైకి తీసుకురాగల పెద్దరికం ఉన్నందున.. అఖిలపక్ష సమావేశాల బాధ్యతను అప్పగిస్తున్నామని, దీన్ని స్వీకరించాలని జానారెడ్డిని సీఎం కోరినట్లు సమాచారం. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ జరిగే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. ఇక, శనివారం సాయంత్రం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే మహిళా శక్తి సదస్సులో సీఎం పాల్గొంటారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించేందుకు శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఆయన మరోమారు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.