Congress Govt: ఎందుకు అలా చేశారు
ABN , Publish Date - May 14 , 2025 | 04:12 AM
15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి మద్యం సీసాలపై లేబుల్స్ కాంట్రాక్టు ఇచ్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.

15 ఏళ్లుగా ఒక్కరికే లేబుల్స్ వేసే కాంట్రాక్టు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్
నివేదిక అడగడంతో ‘ఎక్సైజ్’లో హడావుడి
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి) : మద్యం సీసాల మీద అతికించే లేబుల్స్ కాంట్రాక్టు ఆబ్కారీ శాఖ 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి కట్టబెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. మద్యం సీసాలపై లేబుల్స్ అతికించే పనికి 2010లో బీవోటీ ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖలో అడుగుపెట్టిన వ్యక్తి అప్పటి నుంచీ కొనసాగుతునే ఉన్నారు. టీజీ ఆన్‌లైన్, ఎన్‌ఐసీ వంటి సంస్థలు ప్రభుత్వ అవసరాల కోసం పని చేస్తున్నా.. ప్రభుత్వం టు ప్రభుత్వం ప్రాతిపదికన ఈ కాంట్రాక్టును అప్పగించేందుకు అవకాశం ఉన్నా.. ఎక్సైజ్ శాఖ కొంతమంది ఉన్నతాధికారుల ప్రయోజనాల కోసం.. ప్రభుత్వ సంస్థలను కాదని.. ప్రైవేటు వ్యక్తుల మీదనే ఆధారపడుతుంది. ఈ విషయంపై ఈ నెల 11న ‘15ఏళ్లుగా ఒక్కరికే కాంట్రాక్టా?’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి ప్రభుత్వం స్పందించింది. కథనంలోని అంశాలను పేర్కొంటూ.. ఎందుకు అలా చేశారో నివేదిక ఇవ్వమని కోరింది. దీంతో ఆ శాఖ కమిషనర్.. మిగిలిన అధికారులతో వివరాలు సేకరిస్తున్నారు.