Share News

CM Revanth Reddy: ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి

ABN , Publish Date - May 28 , 2025 | 07:49 AM

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ గురుకుల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రదర్శనపై సీఎం బహుమతులు అందజేయనున్నారు.

CM Revanth Reddy: ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి

  • విద్యాశాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులతో పాటు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితారాణా, ఇతర అఽధికారులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి సీఎం రేవంత్‌కు వివరించారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టబోయే చర్యలకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితారాణావివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యార్థులకు అందించే యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు, భోజనం మెనూ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ అంశాలన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేసుకుని త్వరలో మరో సమావేశానికి రావాలని సూచించారు.

ఎస్సీ గురుకుల విద్యార్థులకు నేడు సీఎం బహుమతుల ప్రదానం

ఎస్సీ గురుకులాల్లో చదివి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా బహుమతులను అందించనున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ రోడ్‌ నంబరు-10లో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. ఐఐటీ, జేఈఈ, నీట్‌లో ర్యాంకులు సాధించిన, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్టు వెల్లడించారు.

Updated Date - May 28 , 2025 | 07:50 AM