Puppalaguda: ‘భూమాయ’పై సర్కార్ ఆరా
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:52 AM
పుప్పాలగూడలోని రూ.వేల కోట్ల విలువైన కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో అధికారయంత్రాంగం కదిలింది.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన యంత్రాంగం
పుప్పాలగూడ కాందిశీకుల భూరికార్డుల పరిశీలన
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): పుప్పాలగూడలోని రూ.వేల కోట్ల విలువైన కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో అధికారయంత్రాంగం కదిలింది. హైదరాబాద్ నడిబొడ్డున 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న రూ.వేల కోట్ల విలువైన కాందిశీకుల భూముల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు.. గత ప్రభుత్వ హాయంలో పెద్దలు అడిగిందే తడవుగా హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. దీనిపై గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో.. ‘భూమాయ చేశారు’ అనే శీర్షికన వార్తాకథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై ఆరా తీసింది. కాందిశీకుల భూముల వివరాలతో పాటు.. ఆ భూముల్లో చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతుల వివరాలను ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
దీనిపై జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల నుంచి సమాచారం కోరింది. అలాగే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఈ భూముల వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారా? అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ భూముల్లో కొన్ని సర్వే నంబర్లపై ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సీలింగ్ వివాదాలు కూడా ఆయా న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. వీటి వివరాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి లోకాయుక్తకు, ఈడీకి అందిన ఫిర్యాదుల వివరాలు కూడా ప్రభుత్వం కోరినట్లు తెలిసింది.