Kaleshwaram Project: మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదు?
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:44 AM
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 38 మందికి షోకాజు నోటీసులు జారీ చేసింది. మంగళవారం కొందరికి ఈ నోటీసులు అందగా..
‘కాళేశ్వరం’ బాధ్యులైన 38 మంది అధికార్లకు షోకాజ్
విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కారు చర్యలు
వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు!
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 38 మందికి షోకాజు నోటీసులు జారీ చేసింది. మంగళవారం కొందరికి ఈ నోటీసులు అందగా.. బుధవారం మిగిలిన వారికి చేరనున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించే 17 మందిపై నేరపూరిత కేసులో విచారణ చేపట్టాలని, 33 మందిపై శాఖాపరమైన చర్యలు, పదవీ విరమణ చేసిన ఏడుగురికి నిబంధనలు అనుసరించి పెన్షన్‌లో కోత విధిస్తూ జరిమానాలు వేయాలని విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 57 మందిపై చర్యలకు సిఫారసు చేయగా.. ఒక్కొక్కరిపై రెండు, మూడు కేసులు ఉండడంతో అంతా కలిపి 38 మందిగా గుర్తించి, నోటీసులు ఇచ్చే పని ప్రారంభించారు. ‘మీపై వచ్చిన అభియోగాలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వండి’ అని అందరికీ ఒకే నమూనాలో నోటీసులు పంపారు. ఈ నోటీసులకు వారంలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
వివరణ అందిన తర్వాత, దాన్ని పరిశీలించి.. క్రిమినల్ కేసులు పెట్టాలా? శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా? పెన్షన్‌లో కోత విధించాలా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీరే కాకుండా ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైన్ చేసిన సమయంతో పాటు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయేదాకా నీటిపారుదల, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులుగా పనిచేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. సరైన కారణాల్లేకుండా ప్రాజెక్టు రీ డి జైన్ ప్రతిపాదనలను ఆమోదించిన వారిపై చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. వారిపై ఏం చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇక విజిలెన్స్ కమిషన్ 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సిఫారసు చేయగా.. అందులో 10 మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన ఏడుగురిలో ఇద్దరు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. మిగిలేది ఐదుగురే. 33 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా.. వారిలో 8 మంది రిటైరయ్యారు. 25 మంది సర్వీసులో ఉన్నారు.
జస్టిస్ ఘోష్ నివేదిక పరిస్థితేంటో?
కాళేశ్వరం కమిషన్ ఈ నెలాఖరున లేదా జూలై తొలివారంలో ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశాలున్నాయి. ప్రధానంగా ప్రజాప్రతినిధులతో పాటు 24 మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది.