Fertility Centers: లోపాల పుట్టలుగా ఫర్టిలిటీ కేంద్రాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:49 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల్లో 55 సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు సర్కారు గుర్తించింది. ఈ కేంద్రాలకు సోమవారం షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు.
ఆస్పత్రి జాబితాలో కనిపించే డాక్టర్లు వేరు.. అక్కడ పనిచేసేవాళ్లు వేరు
ఎంబ్రియాలజిస్టులు లేకుండానే నిర్వహణ
నిబంధనలకు విరుద్ధంగా 55 సెంటర్లు
వాటికి రేపు నోటీసులు.. తర్వాత చర్యలు
381 కేంద్రాల్లో తనిఖీలు పూర్తి
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంతాన సాఫల్య కేంద్రాల్లో 55 సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు సర్కారు గుర్తించింది. ఈ కేంద్రాలకు సోమవారం షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల సృష్టి ఫర్టిలిటీ కేంద్రం సరోగసి పేరుతో చేసిన మోసం, శిశు అక్రమ రవాణా వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు చేసి, నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 381 సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి. తొలుత గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిఽధిలో ఉన్న 271 కేంద్రాలను 35 బృందాలు తనిఖీలు చేశాయి. ఆ తర్వాత జిల్లాల్లోని 110 కేంద్రాల్లో జాయింట్ డైరెక్టర్ స్థాయి హోదా ఉన్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలను అధికారులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణకు అందజేశారు. నివేదికలను పరిశీలించి, మొత్తం 55 కేంద్రాల్లో లోపాలున్నట్లు గుర్తించారు. వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, అనంతరం వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ఏమేం లోపాలు గుర్తించారు?
రాష్ట్రంలో కొన్ని ఫర్టిలిటీ కేంద్రాలు నిబంఽధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తనిఖీల ద్వారా సర్కారు గుర్తించింది. ఫర్టిలిటీ కేంద్రం రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న సిబ్బంది సంఖ్యకు, అక్కడ పనిచేస్తున్న వారి సంఖ్యకు పొంతన లేదని తేల్చారు. అక్కడ పనిజేసే డాక్టర్ల పేర్లకు, రికార్డుల్లో ఉన్న వైద్యుల పేర్లకు సంబంధం లేదని తనిఖీ బృందాలు తేల్చాయి. రేడియాలజిస్టులు, ఎంబ్రియాలజిస్టులు లేకుండానే కొన్ని కేంద్రాలు నడుస్తున్నాయని బృందాలు గుర్తించాయి. రికార్డుల్లో చూపిన అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలకు, అక్కడున్న సంఖ్యకు సరిపోలడం లేదు. కాగా ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్‌డీటీ) యాక్ట్ ప్రకారం ఫర్టిలిటీ కేంద్రాల్లో నిర్వహించే ప్రతి అలా్ట్ర సౌండ్ స్కానింగ్‌ను ఆన్‌లైన్ చేయాలి. అయితే మెజారిటీ కేంద్రాలు.. తాము జరిపే అలా్ట్రసౌండ్ స్కానింగ్స్‌కు, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న స్కానింగ్స్ సంఖ్యకు సగానికి సగం తేడా ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. గర్భిణులకు నిర్వహించే స్కానింగ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదంటే అనుమానించాల్సి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. గర్భవిచ్ఛిత్తి కేసుల విషయం బయటపడుతుందనే స్కానింగ్‌ల వివరాలను పూర్తిగా ఆన్‌లైన్ చేయడం లేదని తనిఖీ బృందాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని సర్కారుకిచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక 80 శాతం కేంద్రాల్లో ధరల పట్టిక ప్రదర్శించడం లేదని గుర్తించారు. అక్కడ పనిజేసే వైద్యుల వివరాలను కూడా ప్రదర్శించాల్సివుండగా ఆ పట్టికా లేదని తేల్చారు.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..