Share News

హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు ప్రతి నెలా రూ.59 కోట్లు

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:12 AM

ఉద్యోగుల ఆరోగ్య పథకం(న్యూ ఈహెచ్‌ఎస్)పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పథకం అమలుకు హెల్త్‌కేర్‌ ట్రస్టు ఏర్పాటు చేయనుంది.

హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు ప్రతి నెలా రూ.59 కోట్లు

  • ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కారు చెల్లింపు

  • ట్రస్టు ఖాతాలో ఏటా రూ.720 కోట్లు జమ

  • వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ భేటీ

హైదరాబాద్‌, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం(న్యూ ఈహెచ్‌ఎస్)పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పథకం అమలుకు హెల్త్‌కేర్‌ ట్రస్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల నేతలతో వచ్చే వారంలో సమావేశం కానున్నారు. కాగా, ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులు నెలకు రూ.500 చొప్పున వారి వాటా కింద చెల్లిస్తే. అందుకు సమాన వాటాను జత చేసి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్టు ద్వారా ఉద్యోగులకు వైద్య సేవలు అందించనున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగులు(2,67,874), పెన్షనర్లు (2,56,556), పోలీసులు(70,018) కలిపి మొత్తం 5,94,448 మంది ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. ఉద్యోగులు, సర్కారు వాటా కింద హెల్త్‌కేర్‌ ట్రస్టుకు ప్రతీ నెలా రూ.59.44 కోట్లు జమ అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.720 కోట్లు జమ అవుతాయి. ప్రతీనెలా 10వ తేదీన ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటాను ట్రెజరీ నుంచి హెల్త్‌కేర్‌ ట్రస్టు ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు ఈ నిధుల నుంచి చెల్లింపులు చేస్తారు.


వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, నగదు రహిత వైద్యం కోసం ప్రభుత్వం రూ.2,298 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే ఏడాదికి సగటున మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.409 కోట్లు, నగదు రహిత వైద్యం కింద రూ.166 కోట్ల కలిపి రూ.575 కోట్లు వెచ్చించింది. అయితే, కొత్త ఈహెచ్‌ఎ్‌స కింద ఏడాదికి రూ.720 కోట్లు ఖర్చు పెట్టాలన్న యోచనలో సర్కారు ఉండడం గమనార్హం. అయితే, వాటా అంశంలో ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటాగా ఎక్కువ మొత్తం చెల్లించే వారికి అపరిమిత వైద్య సేవలను అందించాలని పలువురు కోరుతున్నారు. అయితే, వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ నిర్వహించే సమావేశంలో ఉద్యోగుల వాటాపై స్పష్టత వస్తుందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, కొత్త ఈహెచ్‌ఎ్‌సలో ఉద్యోగుల వాటా ఎంత ? అనే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ గతంలో రెండు ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన కింద ఉద్యోగుల మూలవేతనం నుంచి ఒక శాతం మొత్తాన్ని తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ విధానం వల్ల ప్రతీనెలా సుమారు రూ.29.19 కోట్లు, ఏడాదికి రూ.350 కోట్లు జమ అవుతాయని అంచనా వేసింది. ఈ మొత్తానికి ప్రభుత్వం నుంచి మరో రూ.250 కోట్లు జమ చేస్తే మొత్తంగా రూ.600 కోట్లు అందుబాటులో ఉంటాయనేది అంచనా. ఇక, రెండో ప్రతిపాదన కింద ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% తీసుకుంటే నెలకు 43.79 కోట్లు, ఏడాదికి రూ.525 కోట్లు జమ అవుతాయని పేర్కొంది. ఈ మొత్తానికి సర్కారు నుంచి 75కోట్లు జమచేస్తే 600కోట్లు అవుతాయని తెలిపింది. కానీ ఈ ప్రతిపాదలను పక్కనపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ ఉద్యోగి నెలకు రూ.500వాటాగా చెల్లించాలని, అంతే మొత్తాన్ని తాము ఇస్తామని పేర్కొంది.

Updated Date - Jun 07 , 2025 | 03:12 AM