Share News

Assistant Professor: వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ!

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:25 AM

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..! 15 ఏళ్ల నిరీక్షణ ఫలించేలా ప్రభుత్వం నియామకాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Assistant Professor: వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీ!

  • మొత్తం ఖాళీలు 1,061

  • రిక్రూట్‌మెంట్‌కు సర్కారు మార్గదర్శకాలు

  • 15 ఏళ్ల తర్వాత నియామకాలపై స్పష్టత

  • మూడుదశల్లో ఎంపిక ప్రక్రియ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..! 15 ఏళ్ల నిరీక్షణ ఫలించేలా ప్రభుత్వం నియామకాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అన్ని సంప్రదాయ కోర్సుల్లో సహాయక అధ్యాపకుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ వర్సిటీల్లో 2,817 బోధన పోస్టులుండగా.. వాటిల్లో 1,524 పోస్టులు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీకి సంబంధించినవి. అయితే.. ప్రస్తుతం 463 మంది రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా.. 1,061 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే..! ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాల్లో సవరణలు చేశారు. కనీసం 50ు ఖాళీలను భర్తీ చేయాలని, వందల మందిని ఇంటర్వ్యూలకు పిలవకుండా.. పరీక్షలతో వడబోత ద్వారా ఒక్కో పోస్టుకు ఇద్దరిని పిలవాలని కమిటీ సూచించింది. యూజీ, పీజీ, సాంకేతిక, ఫిజికల్‌ విద్యాబోధనకు సంబంధించిన వారికి ఒకేరకమైన నిబంధనలను అమలు చేయాలని కోరింది. త్వరలోనే ఈ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నత విద్యామండలి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది.


తాజా మార్గదర్శకాల్లో కీలకాంశాలు

  • విశ్వవిద్యాలయంలో నియామకాలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి, రోస్టర్‌ పద్ధతి, రిజర్వేషన్‌ ప్రక్రియలను పూర్తిచేస్తారు

  • అకాడమిక్‌ రికార్డు, పరిశోధనలకు, అర్హత పరీక్షకు సంబంధించి 50 మార్కులు.. విషయ పరిజ్ఞానం, బోధనలో నైపుణ్యానికి 30 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటాయి

  • అకాడమిక్‌ మార్కుల్లో.. యూజీ, పీజీల్లో 70శాతానికి పైన మార్కులు సాధించిన వారికి 8+12 మార్కులు ఇస్తారు. 60-70ు మధ్య మార్కులుంటే 6+10, 50-60 మధ్యన ఉంటే 4+8 మార్కులు కేటాయిస్తారు. 50ులోపు మార్కులుంటే యూజీకి 2, పీజీకి సున్నా మార్కులిస్తారు

  • అర్హత పరీక్షలకు సంబంధించి.. జేఆర్‌ఎ్‌ఫకు ఎంపికైన వారికి 10, నెట్‌/సెట్‌/స్లేట్‌ ఉత్తీర్ణులైన వారికి 5, పీహెచ్‌డీ చేసిన వారికి 10, ఎంఫిల్‌ చేసిన వారికి 5, పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారికి/హాజరైన సదస్సులకు గరిష్ఠంగా 5 మార్కులు ఇస్తారు. సంబంధిత సబ్జెక్టుపై పుస్తక రచనకు 5, సంయుక్త రచనకు 3, ఎడిటర్‌కు 2 చొప్పున మార్కులను కేటాయిస్తారు. పోస్ట్‌ డాక్టర్‌ ఫెలోషిప్‌, రిసెర్స్‌ అసోసియేట్‌లకు ఒక్కో సంవత్సరానికి 2 చొప్పున గరిష్ఠంగా 5 మార్కులను ఇస్తారు

  • ప్రతి దశలోనూ ఎంపిక ప్రక్రియపై అపోహలకు తావులేకుండా మార్కులతోపాటు.. అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పెడతారు

  • 1:10 నిష్పత్తిలో టాప్‌ 10 మందిని రెండో దశకు ఎంపిక చేస్తారు. 1:5 నిష్పత్తిలో టాప్‌ 5 గురిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు

  • ఉపకులపతి అధ్యక్షతన సెలెక్షన్‌ కమిటీ ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్టుపై అభ్యర్థికి ఉండే అవగాహన, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులను కేటాయిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:25 AM