Share News

GHMC: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:22 AM

హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) రాజేంద్రనగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కె.రవి కుమార్‌ శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

GHMC: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్‌

  • నిబంధనల పేరుతో హోటల్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ డీసీ రవికుమార్‌ బెదిరింపు

  • రూ.5 లక్షల లంచం డిమాండ్‌

  • 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

రాజేంద్రనగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) రాజేంద్రనగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కె.రవి కుమార్‌ శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సర్కిల్‌ పరిధిలోని ఒక హోటల్‌.. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ దాని యజమానిని వారం రోజులుగా రవి కుమార్‌ బెదిరిస్తున్నాడు. ‘మీ మీద చర్యలు తీసుకోవద్దంటే నాకు రూ.5 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశాడు. దీంతో బుద్వేల్‌లోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ కె. రవి కుమార్‌ చాంబర్‌లో ఆయనకు శుక్రవారం సదరు హోటల్‌ యజమాని రూ.2 లక్షల ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


మీడియాకు ఇవ్వడానికి తీసుకున్నట్లు రవి కుమార్‌ తమ విచారణలో చెప్పాడని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ కె.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కె.రవి కుమార్‌కు ఇటీవల సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పదోన్నతి లభించిన తర్వాత బదిలీ కావాల్సి ఉన్నా, తనకున్న పరిచయాలతో ఇక్కడే కొనసాగుతున్నారు. రవి కుమార్‌తో ఇదే సర్కిల్‌లో 8 నెలల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారుల సంఖ్య ఐదుగురికి చేరుకుంది. ఇంతకు ముందు సర్కిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఏఈ బల్వంత్‌రెడ్డి, ఏఈ వెంకోబా, బిల్‌ కలెక్టర్‌ మధు, అతడి అసిస్టెంట్‌ రమేశ్‌లను ఏసీబీ అరెస్టు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:22 AM