High Court: అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చి.. ఆపై కూల్చివేతల పేరుతో డ్రామా!
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:08 AM
జీహెచ్‌ఎంసీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణం జరుగుతోందని తెలిసినప్పటికీ ఏ చర్యలు తీసుకోకుండా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చివేస్తామంటూ డ్రామాలు ఆడుతుంటారని పేర్కొంది.
జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణం జరుగుతోందని తెలిసినప్పటికీ ఏ చర్యలు తీసుకోకుండా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చివేస్తామంటూ డ్రామాలు ఆడుతుంటారని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 32లో ఉన్న భవనం ఐదో అంతస్తుకు నోటీసు ఇవ్వడం చెల్లదని పేర్కొంటూ కే రఘువీరాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ భవన నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? నిర్మాణం జరుగుతున్నప్పుడు కళ్లు మూసుకున్నారా?జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్రమ నిర్మాణాలకు అవకాశం కల్పించి.. భవన యజమానులు హైకోర్టుకు వచ్చిన తర్వాత తీరిగ్గా ఆర్డర్ ఇస్తారు. ఈలోపు అక్కడ నిర్మాణం మొత్తం పూర్తవుతుంది.
ఇక కూల్చివేస్తామంటూ డ్రామా మొదలుపెడతారు. జీహెచ్‌ఎంసీలో ప్రతి ప్రాంతానికి అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు కదా ? అలాంటప్పుడు అక్రమ నిర్మాణాలకు అవకాశం ఎలా లభిస్తోంది. వేలసంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయి. పన్ను వసూళ్లు చేసేటప్పుడు మాత్రం ఏదీవదలకుండా చూస్తారు ’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిటిషనర్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీఆర్‌ఎస్) కింద పెట్టుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ యథాతథ స్థితి విధించింది. విచారణను జూలై 15కు వాయుదా వేసింది.