Share News

Ganesh Chaturthi: రా.. రా.. గణేశా..రావయ్యా.. గణేశా

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:57 AM

వినాయక చవితి అంటే.. మామూలు పండగ కాదు.. ఒక ఎమోషన్‌! పందిరి వెయ్యడం దగ్గర్నుంచీ..

Ganesh Chaturthi: రా.. రా.. గణేశా..రావయ్యా.. గణేశా

నిమజ్జనమే కాదు.. ఆగమనమూ వేడుకే

  • వేడుకగా మండపాలకు విగ్రహాలు

  • డీజేలతో ట్రెండీగా మార్చేస్తున నవతరం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి అంటే.. మామూలు పండగ కాదు.. ఒక ఎమోషన్‌! పందిరి వెయ్యడం దగ్గర్నుంచీ.. నిమజ్జనం దాకా ప్రతిదీ ఒక వేడుకే. అయితే గతంలో పెద్దగా కనిపించని, ఈసారి మాత్రం ఎక్కువగా కనిపిస్తోన్న ధోరణి.. గణేశ ఆగమన వేడుకల నిర్వహణ. అదేమిటి అంటే.. వినాయక విగ్రహాలను తయారీదారుల నుంచి తాము ఏర్పాటుచేసిన మండపాల వద్దకు వేడుకగా తీసుకురావడం. మహిళలు సంప్రదాయ హారతులతో స్వాగతిస్తుండగా, సంగీతం, నృత్యం, బాణాసంచా పేలుళ్లతో గణనాధుడ్ని వైభవంగా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మండపాలలో ప్రవేశపెడుతున్నారు. నిమజ్జనం మాత్రమే ఎందుకు.. స్వామివారి ఆగమనమూ వేడుకే కదా అంటూ నేటి యువత ఆ సంబరాలనూ సందడిగా నిర్వహిస్తూ ఈ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా.. రాజధాని నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ ఈసారి గణేశ ఆగమన వేడుకలు భారీస్థాయిలో జరుపుతుండటం విశేషం. సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో లైక్స్‌ కోసం కూడా కొంతమంది వినాయక ఆగమనమూ వేడుకగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లు ఘనంగా కనిపించేందుకు ప్రత్యేకంగా ధోల్‌ బృందాలను మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి తీసుకురావడమే కాదు, భారీ సెట్టింగ్‌లనూ వేస్తున్నారు. ఇక బాణసంచా, డీజె, డ్రెస్‌ కోడ్‌, నృత్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. గత సంవత్సరం పాతబస్తీ, రాంనగర్‌లో ఈ ధోరణి కాస్త కనిపించింది కానీ, ఈ సారి నగరమంతా ఈ సందడి పాకింది. ఆగస్టు 18న కొత్తపేటలో, ఆగస్టు 20న ‘లాల్‌ దర్వాజా కా రాజా’ పేరిట పాతబస్తీలో ఆగమన యాత్ర అంగరంగ వైభోగంగా నిర్వహించారు. సుల్తాన్‌ బజార్‌, రాంనగర్‌ లలో కూడా భారీగానే ఈ తరహా యాత్రలు జరిగితే, మూసారాంభాగ్‌లోనూ 22 అడుగుల ఎత్తైన గణేశ విగ్రహాగమన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 24 న బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14 వెంకటేశ్వర నగర్‌లో కూడా భారీస్థాయిలోనే ఆగమన వేడుకలు జరిగాయి. ఈసారి ఖైరతాబాద్‌ గణేశుని వద్ద కూడా ఈ ఆగమన యాత్ర నిర్వహించడం మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది. ఏకంగా ఆరు రకాల బ్యాండ్‌లు, భారీ ఏర్పాట్లతో అక్కడ వేడుక నిర్వహించడం విశేషం. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. స్థానిక యువతతో కలసి సరదాగా స్టెప్పులేశారు.

XCGZN.jpgGNCZGFN.jpg

ఖర్చెంతైనా..

గతంలో నిమజ్జనం వేళ కనిపించే మహారాష్ట్ర బ్యాండ్‌లు ఇప్పుడు ఆగమన వేడుకల్లోనే సందడి చేస్తున్నాయి. పాడ్‌ బ్యాండ్‌కు రూ.లక్ష, స్టాండింగ్‌ డీజె కు రూ.2 లక్షల నుంచి 5 లక్షలు, అలంకరణకు 50వేల నుంచి లక్ష లైటింగ్‌కు లక్ష ఇలా అన్నీ లక్షల్లోనే ఉన్నా.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడం విశేషం.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 02:57 AM