Kishan Reddy: ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:51 AM
ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందగానే ఆయన ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలను పంపాలని అమిత్‌షాకు విజ్ఞప్తి
పరిస్థితిని సమీక్షిస్తున్నాం: బండి సంజయ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందగానే ఆయన ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని వెంటనే బయటకు తీసుకురావడంపై దృష్టి సారించాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడి ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం, విజయవాడ నుంచి 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఎస్‌ఎల్‌బీసీ వద్దకు కేంద్ర హోంశాఖ పంపించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యాలయంలోని కంట్రోల్ రూం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తున్నామన్నారు. సంఘటన స్థలంలో 4 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు.
ప్రమాద ఘటనపై విచారణ జరపాలి: సీపీఎం
ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొరంగ ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. .