Free Schemes: ఉచితాలు దేశాభివృద్ధికి అవరోధమే
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:02 AM
పేదరికం అధికంగా ఉన్న భారత్‌లో ఉచిత పథకాలు అవసరమేనని, అయితే అవి హద్దుమీరితే దేశాభివృద్ధికి అవరోధంగా మారతాయనడంలో సందేహం లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు.

ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
ఉచితాలపై అన్ని పార్టీలదీ ఒకే తీరని విమర్శ
రంగులు వేరైనా డబుల్ ఇంజన్‌లానే నడవాలి
రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి
బీపీఆర్ విఠల్ సంస్మరణ సభలో దువ్వూరి
హైదరాబాద్ సిటీ, జనవరి30(ఆంధ్రజ్యోతి): పేదరికం అధికంగా ఉన్న భారత్‌లో ఉచిత పథకాలు అవసరమేనని, అయితే అవి హద్దుమీరితే దేశాభివృద్ధికి అవరోధంగా మారతాయనడంలో సందేహం లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. విద్య, వైద్యం తదితర సేవలు ఉచితంగా అందించడం ద్వారా మరింత సత్ఫలితాలను సాధించవచ్చని వివరించారు. ఉచితాల విషయంలో అన్ని పార్టీలు ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని, అంతకన్నా అదే ఖర్చుతో వారికి మరింత తోడ్పాటును అందించే మరొక పథకం అందించవచ్చేమో ఆలోచించాలని సూచించారు. ముందుగా అధ్యయనం ద్వారా ఏ పథకంతో ప్రజలు అధిక ప్రయోజనం పొందుతారన్న విషయంపై అవగాహనకు రావాలని ఆయన హితవు పలికారు.
ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మూడవ స్మారకోపన్యాసంలో భాగంగా అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీ్‌స(సెస్) వేదికగా ‘భారత ఆర్థిక సమాఖ్యవాదం-భవిష్యత్తు’ అంశంపై దువ్వూరి కీలకోపన్యాసం చేశారు. కేంద్ర, రాష్ట్రాలలో భిన్న దృక్పథాలు లేదా విభిన్నాభిప్రాయలు కలిగిన పార్టీలు అధికారంలో ఉన్నప్పటికి, వాటి మధ్య సంబంధాలు మాత్రం డబుల్ ఇంజన్ సర్కారులాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరు ప్రభుత్వాల దృష్టి దేశాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వికసిత భారత్-2047 లక్ష్యాన్ని సాధించగలమని నొక్కిచెప్పారు.
రాష్ట్రాల సగటు వాటాలో భారత్ మెరుగు
కేంద్ర, రాష్ట్ర వనరులు, అధికారాలు, పన్నులు, వ్యయ బాధ్యతలు రాజ్యాంగానికి అనుగుణంగా సాగాలని దువ్వూరి సూచించారు. కేంద్రం రాష్ట్రాలకు పంచుతున్న వ్యయం వాటాలో 60ః40శాతాన్ని అవలంభిస్తోందన్నారు. వ్యయం పరంగా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సగటున 63.9 శాతం ఖర్చు చేస్తుండగా మిగిలింది కేంద్రం ఖర్చు చేస్తోందని, ఈ విషయంలో చాలా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందని దువ్వూరి వెల్లడించారు. బ్రెజిల్‌లో 40.2ు, ఇండోనేషియాలో 37.9ు, అమెరికా, ఆస్ట్రేలియాలో సుమారు 40ు వరకు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు వెచ్చిస్తున్నాయన్నారు. వాటితో పోలిస్తే భారత్‌లోని రాష్ట్రాలు ఎక్కువ వ్యయాన్ని ఖర్చుపెడుతున్నాయని తెలిపారు.