Share News

Farmer Suicide: పొలాల్లో ప్రాణాలొదిలిన నలుగురు రైతులు

ABN , Publish Date - May 20 , 2025 | 05:31 AM

తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుల భారంతో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మిగతా ముగ్గురు ప్రమాదాల్లో మృతిచెందారు.

 Farmer Suicide: పొలాల్లో ప్రాణాలొదిలిన నలుగురు రైతులు

అప్పులు తీర్చలేక ఒకరి ఆత్మహత్య

ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం.. పిడుగు పాటుకు ఒకరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మట్టిపై మమకారం పెంచుకుని, ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట పొలాల్లోనే నలుగురు అన్నదాతలు తుదిశ్వాస విడిచారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడగా, పొలాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు ఇలా వున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల మండలం సుందరగిరికి చెందిన కొక్కుల లచ్చన్న (56) లక్షల్లో అప్పులు తెచ్చి రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. కొన్నేళ్లుగా దిగుబడులు సరిగ్గా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరుకు చెందిన చెందిన పి.మురళీధర్‌రెడ్డి(59) సోమవారం బైక్‌పై వ్యవసాయ క్షేత్రానికి వెళ్తూ కింద పడివున్న విద్యుత్‌ వైర్లను గమనించకపోవడంతో బైక్‌ వాటికి తగిలి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బైక్‌తో పాటు మురళీధర్‌రెడ్డి కాలిపోయి మృతి చెందాడు. ఇదే జిల్లా కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెంలో సోమవారం సాయంత్రం పిడుగు పడి 17 గొర్రెలు మృతిచెందాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య(42) పక్క గ్రామమైన రేపల్లేవాడ సమీపంలోని తమ పొలంలో బావి తవ్వుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పుల్లయ్య తమ్ముడు వెంకటేశ్వర్లు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం కోర్పోల్‌కు చెందిన నారన్నగారి వెంకటరెడ్డి(53) మంజీరా నదిలో ఏర్పాటు చేసుకున్న పంపుసెట్‌ చెడిపోవడంతో మరమ్మతు కోసం బయటకు తీసేందుకు ఆదివారం సాయంత్రం నదిలోకి దిగి గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:31 AM