Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:21 AM
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దాదాపు ఏడాదిపాటు ఇన్‌చార్జిగా వ్యవహరించిన దీపా దాస్‌మున్షీ స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు.

దీపా దాస్‌మున్షీ స్థానంలో నియామకం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దాదాపు ఏడాదిపాటు ఇన్‌చార్జిగా వ్యవహరించిన దీపా దాస్‌మున్షీ స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, కాంగ్రెస్ భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్‌కు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొప్పుల రాజుకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. వీరితోపాటు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌చార్జులను నియమించింది. ఇందులో త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ సైతం ఉంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. బిహార్ ఇన్‌చార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ అళ్లవారు, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ ఇన్‌చార్జిగా రజనీ పాటిల్, హరియాణాకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్‌కు హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్చేరికి గిరీశ్ చౌడాంకర్, ఒడిసాకు అజయ్‌కుమార్ లల్లూ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌కు సప్తగిరి శంకర్ ఉల్కాను నియమించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రె్‌సకు కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యప్రదేశకు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎ్‌సయూఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2022 వరకు ఎన్‌ఎ్‌స యూఐ జాతీయ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు మంద్‌సౌర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలనే పేరుంది. మీనాక్షి నటరాజన్ నియామకం పట్ట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ వెళ్లిన రేవంత్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఢిల్లీకి వచ్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రెండు రోజులపాటు మంతనాలు జరిపిన రేవంత్‌కు వారం తిరగకముందే మళ్లీ అధిష్ఠానం నుంచి పిలుపు వ చ్చింది. దీంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం.. శనివారం పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా కలుసుకోనున్నారు. ఇంతకుముందు రేవంత్‌తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా పిలవగా.. ఈసారి సీఎం ఒక్కరినే పిలవడం గమనార్హం. గతవారం పార్టీ పెద్దలు పీసీసీ కార్యవర్గం ఎంపికపై మంతనాలు జరపడంతోపాటు కులగణనపై కూడా సమీక్ష నిర్వహించారు. మంత్రివర్గ జాబితాపై మాత్రం ఏకాభిప్రాయం లేకపోవడంతో దానిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ విషయాలను కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉదయం రాహుల్‌గాంధీకి వివరించారు. దీంతో రాహుల్ ఆదేశాల మేరకే రేవంత్‌ను మళ్లీ ఢిల్లీ పిలిపించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణపై కూడా రేవంత్ అధిష్థానంతో మరోసారి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.