Flood Water Hits MG Bus Stand: ఎమ్‌జీబీఎస్‌లో తగ్గని వరద నీరు.. పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:59 AM
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి.
ఎమ్‌జీబీఎస్‌కు వరద నీరు పోటెత్తుతోంది. మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎమ్‌జీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు తగ్గటం లేదు. ఇప్పటికే ఎమ్‌జీబీఎస్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వాటర్ ఫ్లోటింగ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బస్‌స్టాండ్‌లో రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. బయటి నుంచే ఆయా రూట్లల్లో బస్సులు ఆగిపోయాయి.
అధికారులు ఇప్పటికే బస్ స్టాండ్‌లో ఉన్న అన్ని బస్సులను బయటకు తరలించారు. బయటినుంచే ప్రయాణికులకు బస్సులు ఏర్పాటు చేశారు. వరద నీటి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి నుంచి బస్టాండ్‌లోకి నీటి ప్రవాహం మొదలైంది. వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. గంటల పాటు భయం గుప్పిట్లో అల్లాడిపోయారు. విషయం తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ప్రయాణికులను బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
రంగంలోకి దిగిన అధికారులు నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టంమీద బయటకు తీసుకువచ్చారు. ఎమ్‌జీబీఎస్ వరద నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం మూసీకి వరద నీరు పోటెత్తటమే. 30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డుమీదికొచ్చారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
వరదల నేపథ్యంలో ఎమ్‌బీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.
వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.
సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.
మహబూబ్నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎమ్‌బీజీఎస్‌కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజల్ని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ సంస్థ..
మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన ఎంజీబీఎస్..