Hyderabad: 962 చెరువులకు హద్దులు ఖరారు
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:21 AM
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని 962 చెరువులకు హద్దులను ఖరారు చేస్తూ తుది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

నెలాఖరులోగా 1,000 చెరువుల లక్ష్యం.. ప్రాథమిక జాబితాలో 3 వేల చెరువులు
స్వయంగా పర్యవేక్షిస్తున్న హైకోర్టు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని 962 చెరువులకు హద్దులను ఖరారు చేస్తూ తుది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నెలాఖరులోగా వెయ్యి చెరువు ల హద్దులను ఖరారు చేయడమే లక్ష్యంగా హెచ్‌ఎం డీఏ ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యంలో మిగిలిన మరో 38 చెరువుల విషయంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో సమన్వయంగా ముందుకు సాగు తోంది. ఇలా నోటిఫై చేసిన చెరువుల సంఖ్య గడిచిన పదేళ్లలో 300గా ఉండగా.. దీనిపై ఇటీవల హైకోర్టు సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించడంతో.. హెచ్‌ఎండీఏ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలు, స్థానిక సంస్థల అధికారులు యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తున్నారు. త్వరగా అన్ని చెరువులకు హద్దులను ఖరారు చేసే దిశలో అడుగులు వేస్తున్నారు.
3,510 చెరువుల సర్వే పూర్తి
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్‌పీసీ) ఏర్పాటైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 175 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలోని మిగతా చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను నిర్ణయించేందుకు అప్పట్లోనే ఓ కన్సల్టెన్సీ టెండర్ దక్కించుకుంది. 501 చెరువులకు సంబంధించి.. నీటిపారుదల శాఖ, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వేకు ఒప్పందం కుదిరింది. రెండో దశలో మరో 2,402 చెరువుల సర్వే పూర్తిచేసి, హద్దులను నిర్ణయించాలి. ఇలా దశల వారీగా 3,532కు గాను.. 3,510 చెరువుల సర్వే పూర్తయింది. 22 చెరువుల సర్వే మిగిలి ఉంది.
2,920 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్
చెరువుల సర్వే పూర్తయ్యాక.. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను నిర్ధారిస్తూ నీటిపారుదల, రెవెన్యూ శాఖల ధ్రువీకరణతో హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఇలా ఇప్పటి వరకు 2,920 చెరువులకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. వాటికి ఐడీ నంబర్లను ఇచ్చారు. సర్వే, మ్యాప్‌ల సమాచారాన్ని హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు 3 వేల చెరువులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని హెచ్‌ఎండీఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, ఇప్పటికే 962 చెరువుల హద్దులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు మొత్తం 1,000 చెరువులకు హద్దులను నిర్ధారించేదిశలో చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ హద్దుల ఖరారు తీరును హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది.కూల్చివేతలు, ప్రజల అభ్యంతరాలపై సుమోటోగా విచారణ జరుపుతోంది. ప్రతినెలా ప్రాథమిక, తుది నోటిఫికేషన్ల వివరాలను అధికారుల నుంచి స్వీకరిస్తోంది. స్వయంగా హైకోర్టు పర్యవేక్షిస్తుండడంతో.. ఈ ఏడాది తొలి నెల రోజుల వ్యవధిలో 197 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం! గత నెల 16, 21, ఈ నెల 1 తేదీల్లో చెరువుల హద్దులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా నెలలో 92 చెరువులకు హద్దులను ఖరారు చేశారు. ఈ విషయంలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. నెలలో ఒక్క చెరువుకూ హద్దులను నిర్ధారించలేదు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి సహకారం లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.