Bhadradri: భద్రాద్రి రామయ్యకు ముస్లిం తండ్రీతనయుల స్వరనీరాజనం
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:22 AM
భక్తరామదాసు జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాగ్గేయకార ఉత్సవాల్లో రెండో రోజు, ఆదివారం.. ఇద్దరు ముస్లింలు కచేరి చేశారు.

భద్రాచలం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): భక్తరామదాసు జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాగ్గేయకార ఉత్సవాల్లో రెండో రోజు, ఆదివారం.. ఇద్దరు ముస్లింలు కచేరి చేశారు. వారిద్దరూ తండ్రీకొడుకులు కావడం మరింత విశేషం. వరంగల్‌కు చెందిన మహ్మద్‌లాయక్ అహ్మద్, ఆయన కుమారుడు మహ్మద్ షహబాజ్ తమ కచేరితో ఆహూతులను పరవశింపజేశారు. నారాయణతీర్థ తరంగాల్లోని ‘జయజయ స్వామిన్’ అనే తరంగంతో ప్రారంభించి రామనామమే జీవనము, ఏడనున్నాడో భద్రాద్రివాసుడేడున్నాడో, రామా సీతారామా రఘురామ అంటూ భక్తరామదాసు, త్యాగరాజ స్వామి కీర్తనలను ఆలపించారు.
కచేరీ అనంతరం కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక, రెండో రోజు వేడుకల్లో బూర్లగడ్డ రవికిరణ్, చివుకుల మాధవి ఆలపించిన భక్తరామదాసు కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. చింతలపాటి మంజుల, దుర్గామైత్రేయి వీణ వాయిద్యం అలరింపజేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన వాసా పావని పలు కీర్తనలు ఆలపించారు.