Road Accident: సెలవులకు కొడుకుని ఇంటికి తీసుకొస్తూ.. బైక్ మీద ముగ్గురు.. ఢీకొన్న కారు..
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:48 AM
హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న కుమారుడిని సంక్రాంతి సెలవులకు ఇంటికి తీసుకొస్తూ తండ్రి, అతనికి కుమారుడి వరసైన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.

కడ్తాల్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న కుమారుడిని సంక్రాంతి సెలవులకు ఇంటికి తీసుకొస్తూ తండ్రి, అతనికి కుమారుడి వరసైన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం మైసిగండి గ్రామ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావాజీ భీమయ్య(46), బావాజీ వెంకటయ్య (45) మరణించగా భీమయ్య కుమారుడు శివ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మాడ్గుల మండలం దిల్‌వార్‌ఖాన్‌పల్లికి చెందిన భీమయ్య కుమారుడు శివ.. మహేశ్వరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో శివను ఇంటికి తెచ్చేందుకు భీమయ్య తన అన్న కుమారుడైన వెంకటయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై మహేశ్వరం వెళ్లాడు. ముగ్గురూ కలిసి తిరిగి వస్తుండగా మైసిగండి ఎంఆర్‌జీ గార్డెన్ ఎదుట ఓ స్కార్పియో కారు వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం ముందున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టగా అది అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో వెంకటయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన భీమయ్య, శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భీమయ్య చనిపోయాడు.
పొగమంచుతో ప్రమాదం.. ఒకరి మృతి
తూప్రాన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పొగమంచు వల్ల రహదారి కనిపించక ఓ ద్విచక్రవాహనదారుడు డివైడర్‌ను ఢీకొట్టి గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ శివారులో శనివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో శివ్వంపేట మండలం భోజ్యాతండాకు చెందిన రత్లా శ్రీను(38) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేటలో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను శుక్రవారం విధులకు వెళ్లి శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఇమాంపూర్ వద్ద పొగమంచు వల్ల రోడ్డు కనిపించక డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.