భూ సమస్యల పరిష్కారానికి ఫీజు చెల్లించాల్సిందే!
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:37 AM
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయి. అయితే, ఆ సదస్సుల్లో తమ సమస్యలు చెప్పుకోలేని వారు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఇప్పుడు దరఖాస్తు ఇస్తే రుసుము తప్పనిసరి
రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన వాటికే ఉచితం
రైతులకు తేల్చిచెబుతున్న రెవెన్యూ అధికారులు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయి. అయితే, ఆ సదస్సుల్లో తమ సమస్యలు చెప్పుకోలేని వారు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సదస్సు జరిగినప్పుడు తాము ఊళ్లో లేమని, ఆస్పత్రుల్లో ఉన్నామని ఇలా రకరకాల కారణాలతో రైతులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులకు ఉచిత పరిష్కారం ఉండదని, భూభారతి చట్టం నిబంధనల ప్రకారం ఆయా సేవలకు నిర్దేశించిన ఫీజు చెల్లిస్తేనే దరఖాస్తులను ఆమోదిస్తామని తహసీల్దార్లు చెబుతున్నారు. గతంలో ఉచితమని చెప్పి, ఇప్పుడు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు మాత్రమే ఫీజు మినహాయింపు ఇస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం(సీసీఎల్‌ఏ) తహసీల్దార్లకు లాగిన్ ఇచ్చింది.
దీంతో సదస్సులు ముగిశాక వచ్చే దరఖాస్తులను ఈ లాగిన్ ద్వారా నమోదు చేయలేమని అధికారులు చెబుతున్నారు. మూడు విడతల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో భారీగా దరఖాస్తులు వచ్చాయి. 593 మండలాల్లో 10,725 సదస్సులు నిర్వహించగా సుమారు 9.16 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఎక్కువగా విస్తీర్ణంలో తేడాలు, సర్వే నంబర్లు మిస్సింగ్, మ్యుటేషన్ చేయకపోవడం, అసైన్డ్ భూముల సమస్యలు, ఓఆర్‌సీ, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం, పాస్‌పుస్తకాలు ఇవ్వాలని, హక్కుల రికార్డులో తప్పుగా నమోదు చేసిన పేర్లు, సర్వే నంబర్లను సవరించాలని కోరినవే ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 17 నుంచి జూన్ 20 వరకు మూడు విడతల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ఉచితంగానే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ ప్రకటించింది. కానీ, జూన్ 20 తర్వాత వచ్చే దరఖాస్తులకు మాత్రం నిబంధనల ప్రకారం రుసుములు చెల్లించాల్సి ఉంటుందని క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
భూభారతి నిబంధనల ప్రకారం..
భూ సమస్యల పరిష్కారానికి ఏ సేవకు ఎంత రుసుము చెల్లించాలనేదానిపై భూభారతి నిబంధనల్లో స్పష్టం చేశారు. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ప్రకారం 7.5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. మ్యుటేషన్ లేదా వారసత్వ సేవలకు అయితే ఎకరానికి రూ.2500 లేదా గుంటకు రూ.62.50 చొప్పున చలానా తీసుకోవాలి. పట్టాదారు పాస్‌పుస్తకం కావాలంటే రూ.300, హక్కుల నమోదు సవరణలు, అప్పీళ్ల కోసం రూ.1000, హక్కుల రికార్డు నకలు కోసం రూ.10, స్లాట్ రీ షెడ్యూల్‌కు తొలిసారి ఉచితం. రెండోసారి రూ.500, మూడోసారి ఆపైన ఆరు నెలల్లోపు రూ.1000 చెల్లించాలి.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News