Farmer Gangaram: ఊరి కోసం ... వాగుపై వారధి కట్టాడు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:04 AM
పెన్‌గంగ నది మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో పుట్టి, ఆదిలాబాద్ వైపు తెలంగాణ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ, వార్ధా నదిలో కలుస్తుంది. ఆ నదీ తీరంలోని ‘మణియార్ పూర్’లో గంగారామ్‌కు పదెకరాల పొలం ఉంది. నీటి వనరులున్న నేల కావడంతో అన్ని రకాల పంటలు విస్తారంగా పండుతాయి.
చేనుకు దారికోసం చెమటను వంతెనగా మార్చాడు! ఊరు బాగు కోసం వాగుపై వారధి నిర్మించాడు. ఒకే ఒక్కడు అలాంటి సంకల్పానికి నడుం బిగించాడంటే ఆశ్చర్యమే కదా. ఆ సామాన్య రైతు గంగారామ్ ... ఇది ఆయన తీగల వంతెన కథ...
ఆదిలాబాద్ జిల్లా, బేల మండలం, మణియార్‌పూర్ గ్రామానికి వెళ్లాలంటే, ఆదిలాబాద్ నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాలి. దారిలో వాగులు వంకలు దాటాల్సిందే. మామూలు రోజుల్లో పర్వాలేదు కానీ, వానా కాలంలో కష్టమే.
కష్టాల సాగు...

పెన్‌గంగ నది మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో పుట్టి, ఆదిలాబాద్ వైపు తెలంగాణ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ, వార్ధా నదిలో కలుస్తుంది. ఆ నదీ తీరంలోని ‘మణియార్ పూర్’లో గంగారామ్‌కు పదెకరాల పొలం ఉంది. నీటి వనరులున్న నేల కావడంతో అన్ని రకాల పంటలు విస్తారంగా పండుతాయి. గంగారామ్ తన పొలంలో పత్తి, కూరగాయలు, సోయాబీన్ పండిస్తున్నాడు. అయితే గ్రామం నుంచి తన పొలానికి వెళ్లాలంటే రహదారి లేదు. కిలోమీటరు దాకా పంట పొలాల మధ్య బురుదలో నడవాలి. ‘‘మధ్యలో వాగు అడ్డంగా ఉండటంతో చుట్టూ తిరిగి పొలానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, వాగుకి అవతల పక్కనున్న రైతులందరిదీ. వానకాలం వస్తే వాగులో 6 నెలల పాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది’’ అని గతాన్ని గుర్తు చేశాడు గంగారామ్.
ఈ సమస్య కేవలం ఆయన ఒక్కడిది మాత్రమే కాదు, ఆ ఊరి రైతులందరిదీనూ. వాగు అడ్డంగా ఉండటంతో సేద్యం కష్టమై పోయింది. దీనికి తోడు, ఇన్ని కష్టాల మధ్య పంటలు వేసినా... అధిక వర్షాలొస్తే పెన్‌గంగా పొంగి ప్రవహించి, చేతికి వచ్చిన పంటను ముంచేస్తుంది.
ఇన్ని సమస్యల మధ్య సాగు చేయలేక కొందరు భూములను ఖాళీగా వదిలేసేవారు. వ్యవసాయం తప్ప వేరే ఆదాయం లేని గంగా రామ్ ఈ సమస్యకు ముగింపు పలకాలను కున్నాడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారానికి నడుం బిగించాడు. ఎలాగైనా వాగుపై వారధి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.

ఒకే ఒక్కడు...
పొలాలకు అడ్డంగా ఉన్న వాగు ఎండి పోయినపుడు వంతెన పని మొదలుపెట్టాడు. వంద మీటర్ల వెడెల్పు ఉన్న వాగుకు రెండు వైపులా పిల్లర్లు వేశాడు. ‘‘వృఽథాగా ఉన్న పాత కరెంట్ తీగలను కొని, సిమెంట్ స్తంభాలు, కర్రలు వేసి, పిల్లర్ల మధ్య తీగలు లాగి దాని మీద రేకులు పరిచా. అలా 15 రోజుల్లో వంతెన నిర్మాణం పూర్తి చేశా. మొత్తం రూ.70 వేలు ఖర్చు అయింది’’ అని వివరించాడు గంగారామ్.
తెలంగాణలో ఆఖరి గ్రామం ‘మణియార్ పూర్’. ఇది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గంగారామ్‌కి ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లు వ్యవసాయంలో తండ్రికి సహకరిస్తారు. వాగు మీద 8 మీటర్ల ఎత్తులో, 120 మీటర్ల పొడవుతో ఎవరూ ఊహించని వంతెనను సుసాధ్యం చేశాడు. ఎలాంటి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, నిపుణులు లేకుండా, స్ధానిక వనరులతో తన కలను నిజం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వంతెన మీదుగా మిగతా రైతులు కూడా తమ పొలాలకు వెళ్లి పనులు చేసుకొంటున్నారు.
‘‘వానా కాలం వచ్చిందంటే చాలు, ఆరు నెలల పాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దాంతో మేమంతా పొలాల చుట్టూ 7 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. గంగన్న వంతెన కట్టిన తరువాత మాకు కష్టాలు పోయాయి. గతంలో సేద్యం వదిలేసిన వారు మళ్లీ పంటలు వేస్తున్నారు. వాగు పొంగినా ఇబ్బంది లేకుండా పొలాలకు వెళ్తున్నాం. పండిన పంటను ఇంటికి తెచ్చుకోవడానికి సౌఖ్యంగా ఉంది’’ అని స్ధానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
80 ఏళ్ల వయసులో కూడా ఊరికి ఉపకారం చేయాలనే గంగారామ్ లక్ష్యం నెరవేరింది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తీగల వంతెన నిర్మాణం ఒంటరిగానే చేశాడు. ఈ వంతెన ఇప్పటికీ ఎన్ని వరదలు వచ్చినా తట్టుకొని నిలబడింది. రైతులందరికీ పొలం బాట అయ్యింది!
- శ్యాంమోహన్, 94405 95858
అందమైన కుటీరం
ఈ తీగల వంతెన మాత్రమే కాదు... పెన్ గంగా నదీ ప్రవాహం ఎదురుగా చిన్న కుటీరం నిర్మించుకున్నాడు గంగారామ్. చుట్టూ పండ్ల మొక్కలు, కాయగూరలు పండిస్తున్నాడు. అక్కడే సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ కూడా పెట్టుకున్నాడు. పొలంపనుల్లో అలసిపోయినపుడు రాత్రిపూట అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. కుటీరంలో కూర్చొని చూస్తే ఎదురుగా నది. చుట్టూ కొండలు, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంటుంది. సినిమా షూటింగ్‌లకు సరిపోయే లొకేషన్. ‘షూటింగ్‌లకు ఇస్తావా?’ అని అడిగితే ‘ఇవ్వను’ అని ఖచ్చితంగా చెప్పేశాడు గంగారామ్.