Share News

సచివాలయంలో మరో నకిలీ అధికారి

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:28 AM

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద పెరుగుతోంది. వారం కిందటే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) ఓ నకిలీ ఉద్యోగిని పట్టుకోగా... తాజాగా గురువారం మరో నకిలీ అధికారి పట్టుబడ్డాడు.

సచివాలయంలో మరో నకిలీ అధికారి

  • తహసిల్దార్‌నంటూ కారులో ప్రవేశం

  • అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకున్న భద్రతా సిబ్బంది, కేసు నమోదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద పెరుగుతోంది. వారం కిందటే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) ఓ నకిలీ ఉద్యోగిని పట్టుకోగా... తాజాగా గురువారం మరో నకిలీ అధికారి పట్టుబడ్డాడు. ‘మేడ్చల్‌-మల్కాజిగిరి తహసిల్దార్‌’, ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ అని స్టిక్కర్‌ ఉన్న కారులో సచివాలయంలోకి ప్రవేశించి అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొంపల్లి అంజయ్య (56)ను ఎస్పీఎఫ్‌ సిబ్బంది పట్టుకుని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను గురువారం ఉదయం 11.50 గంటలకు సచివాలయంలోకి ప్రవేశించాడు.


మొదటి అంతస్తులో తిరుగుతున్న అతనిపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి వివరాలు అడిగారు. తాను సూర్యాపేట జిల్లా తిప్పర్తి మండల రెవెన్యూ అధికారినని అంజయ్య చెప్పాడు. ఇతర వివరాలు అడిగితే అనుమానంగా వ్యవహరించడమే కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వద్దకు తీసుకొచ్చారు. పూర్తి సమాచారాన్ని సేకరించగా... అంజయ్య నకిలీ ఐడీ కార్డు తయారుచేయించుకుని, సచివాలయానికి వస్తున్నట్లు తేలింది. అంజయ్యను, కారును పోలీసులకు అప్పగించారు.

Updated Date - Feb 07 , 2025 | 04:28 AM