Excise Department: 15 ఏళ్లుగా ఒక్కరికే కాంట్రాక్టా?
ABN , Publish Date - May 11 , 2025 | 04:42 AM
సాధారణంగా టీజీ ఆన్‌లైన్, ఎన్‌ఐసీ వంటి సంస్థలు ఆన్‌లైన్, సాఫ్ట్‌వేర్ వంటి అంశాల్లో ప్రభుత్వ అవసరాల కోసం పని చేస్తుంటాయి. ప్రభుత్వ సంస్థలు కాబట్టి, భద్రత పరంగా కూడా అవి అనుమానాలకు తావులేని విధంగా సేవలందించే అవకాశం ఉంది.
ఎక్సైజ్‌శాఖలో విచిత్ర పరిస్థితి.. మద్యం సీసాలపై లేబుళ్లు వేసే కాంట్రాక్టు నిరవధికంగా ఓ వ్యక్తికే
ఆ సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థలున్నా పట్టించుకోని వైనం
కొందరు ఉన్నతాధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, మే 10(ఆంధ్రజ్యోతి): మద్యం సీసాల మీద అతికించే లేబుల్ (ఎక్సైజ్ +అడెసివ్ లేబుల్-హీల్స్) కాంట్రాక్టును ఆబ్కారీ శాఖ 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి పనితీరులో ఎటువంటి లోపాలున్నా, ప్రస్తుత అవసరాలకు తగినట్లు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయకపోయినా, నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా.. ఆయన గురించి పట్టించుకునే వారు లేరు. 2010లో ఎక్సైజ్ శాఖలో అడుగుపెట్టిన ఆయన 15 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నారని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. సాధారణంగా టీజీ ఆన్‌లైన్, ఎన్‌ఐసీ వంటి సంస్థలు ఆన్‌లైన్, సాఫ్ట్‌వేర్ వంటి అంశాల్లో ప్రభుత్వ అవసరాల కోసం పని చేస్తుంటాయి. ప్రభుత్వ సంస్థలు కాబట్టి, భద్రత పరంగా కూడా అవి అనుమానాలకు తావులేని విధంగా సేవలందించే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖలో లేబుల్స్ కాంట్రాక్టును కూడా ఈ సంస్థలకు అప్పగించేందుకు అవకాశం ఉంది. టీజీ ఆన్‌లైన్ ఈ తరహా సేవలను ఇప్పటికే అందిస్తోంది కూడా. కానీ.. ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం ప్రభుత్వ సంస్థలను కాదని, ప్రైవేటు వ్యక్తుల మీదనే ఆధారపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు తక్కువకు కోట్ చేశాయని తొలుత కాంట్రాక్టు ఇచ్చినా.. తర్వాత కాలంలో ఏదో నిబంధన అడ్డుపెట్టుకుని మళ్లీ ధర పెంచేస్తున్నాయి. ఇదంతా లోపాయికారీగా నడుస్తోంది.
బీవోటీ ప్రాతిపదికన వచ్చి..
ప్రస్తుతం మద్యం సీసాలకు లేబుళ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ 2010లో బీవోటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన ఎక్సైజ్‌శాఖలోకి వచ్చారు. తనే సాఫ్ట్‌వేర్ అందించడంతోపాటు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసి, వాటిని ప్రభుత్వానికి మూడేళ్లలో అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఈ ఒప్పందాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉన్నారు. 2022లో టెండర్‌కు వెళ్లాలనుకున్నా.. దాన్ని ఆపేసి సదరు వ్యక్తినే కొనసాగించారు. మరోవైపు, ఒప్పందం ప్రకారం ఎక్సైజ్‌శాఖలో ఉండే ఉద్యోగులకు హీల్ లేబుల్స్ సాంకేతికత, నిర్వహణపై ఆ కాంట్రాక్టరు శిక్షణ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. నిర్వహణపరమైన లోపాలున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ లేబుళ్ల అందజేతపై అధికారులు టెండర్లు పిలిచారు. హీల్ లేబుల్స్, సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వటానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు ప్రతిపాదనలు పంపాలని ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. ఏప్రిల్ 30వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సేవలు అందించే ఏజెన్సీలు 15 లోపే ఉన్నాయి. అయితే, ఈ ఏజెన్సీలు ప్రతిపాదనలు పంపినా.. ఏదో ఒక సాకుతో వాటిని పక్కన పెట్టి.. పాత కాంట్రాక్టరుకే మళ్లీ కట్టబెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
ఒక లేబుల్ మీద 22 పైసల లాభం
రాష్ట్రంలో ఏటా సగటున 4 కోట్ల కేసుల లిక్కర్, 5 కోట్ల కేసుల బీర్లు విక్రయిస్తారు. 4 కోట్ల లిక్కర్ అంటే.. ఒక కేసులో 24 సీసాల చొప్పున సుమారు 96 కోట్ల సీసాలకు స్టిక్కర్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీర్ సీసాలకు లేబుల్ వేయడం లేదు. వాటికి కూడా ఈ ఏడాది నుంచి వేయాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. అది అమలైతే 5 కోట్ల కేసుల బీర్లు.. ఒక్కో కేసుకు 12 సీసాల చొప్పున సుమారు 60 కోట్ల సీసాలకు లేబుల్ వేయాల్సి ఉంటుంది. ప్రతి లేబుల్‌కు ప్రభుత్వం 30 పైసలు చెల్లిస్తుంది. అందులో పన్నులు పోను ప్రతి లేబుల్ మీద కాంట్రాక్టరుకు 22 పైసలు మిగులుతుంది. లిక్కర్, బీరు సీసాలన్నింటినీ కలుపుకుంటే ఈ కాంట్రాక్టు విలువ ఏటా దాదాపు రూ.80 కోట్లు.