భవిష్యనిధి సేవలు మరింత విస్తృతం
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:46 AM
రానున్న రోజుల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో) కార్యాలయాలకే రాకుండా డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయనున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా తెలిపారు.

యూపీఐ, ఏటీఏం ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు చర్యలు
కేంద్రమంత్రి మాండవీయా
బేగంపేటలో కిషన్‌రెడ్డితో కలసి ఈపీఎఫ్‌వో జోనల్ ఆఫీసు ప్రారంభం
బేగంపేట, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫవో) కార్యాలయాలకే రాకుండా డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయనున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా తెలిపారు. పీఎఫ్ సొమ్మును యూపీఐ, ఏటీఎం ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో ఈపీఎ్‌ఫవో నూతన జోనల్ కార్యాలయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాండవీయా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి వెన్నెముక కార్మిక శక్తేనన్నారు. కార్మికులకు సేవలందించే ఈపీఎ్‌ఫవో దేవాలయమని.. దీని ద్వారా అధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు. దేశంలో అత్యధిక ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎ్‌ఫవోనే అని స్పష్టం చేశారు. కార్మికులు, ఉద్యోగుల డబ్బుతో సమానంగా కేంద్రం కూడా నిధులను జమ చేస్తుందని చెప్పారు. కార్మికుల సేవల కోసం 201 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించామని చెప్పారు. గతంలో చిన్నచిన్న ఆటంకాలు అనేకం ఉండేవన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ దశల వారీగా తొలగించామని తెలిపారు.
మరిన్ని కార్యాలయాలకు ప్రతిపాదనలు
కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం అనేక నూతన విధానాలను ముందుకు తెస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మరిన్ని ఈఎ్‌సఐ ఆస్పత్రులు, ఈపీఎ్‌ఫవో కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. రామగుండం వంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుతో పాటు ఉద్యోగ భవిష్య నిధి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.