Share News

Saudi Arabia: 30ఏళ్ల కిందటి డిగ్రీ నకిలీదని.. సౌదీలో తెలుగు ఇంజనీర్‌ అరెస్టు

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:16 AM

ఆయన ఓ ఇంజనీర్‌.. 30 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు.. 18 ఏళ్లు ఉద్యోగం చేశారు.. 12 ఏళ్ల కిందే స్వదేశానికి తిరిగి వచ్చేసి కుటుంబంతో గడుపుతున్నారు.

Saudi Arabia: 30ఏళ్ల కిందటి డిగ్రీ నకిలీదని.. సౌదీలో తెలుగు ఇంజనీర్‌ అరెస్టు

  • పన్నెండేళ్ల క్రితమే స్వదేశానికి వచ్చేసిన కరీంనగర్‌ వాసి

  • ఇటీవల హాజ్‌ యాత్రకు వెళ్లొస్తుండగా అక్కడి విమానాశ్రయంలో అరెస్టు.. సౌదీ కోర్టులో విచారణ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఆయన ఓ ఇంజనీర్‌.. 30 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు.. 18 ఏళ్లు ఉద్యోగం చేశారు.. 12 ఏళ్ల కిందే స్వదేశానికి తిరిగి వచ్చేసి కుటుంబంతో గడుపుతున్నారు. ఇటీవలే హాజ్‌ యాత్రలో భాగంగా సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాకు వెళ్లి వస్తుండగా.. అక్కడి అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. 30 ఏళ్ల కింద ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ సమర్పించినట్టుగా కేసు నమోదై ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వయసు 66 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతూ, నడవలేని స్థితిలో వీల్‌ చెయిర్‌ వినియోగిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు సౌదీ విడిచి వెళ్లడానికి వీల్లేదు. దీనితో వీల్‌ చెయిర్‌పైనే సౌదీలో విచారణకు హాజరవుతున్నారు. తాను బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో 1990లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశానని, ఎలాంటి ఫోర్జరీ చేయలేదని ఆయన పేర్కొంటున్నారు. అయితే ఇంజనీరింగ్‌ పట్టా అసలైనదే అయినా ఎంబసీ ధ్రువీకరణ తప్పుడు విధానంలో జరిగితే ఫోర్జరీ కింద పరిగణిస్తారని సౌదీ అధికారులు చెబుతున్నారు. అధికారిక విధానంలో మాత్రమే ధ్రువీకరణ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.


ఎన్నికల కేసుల్లో మంత్రి ఉత్తమ్‌కు ఊరట

హైదరాబాద్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసుల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒక కేసును కొట్టేయగా.. మిగతా రెండు కేసుల్లో ట్రయల్‌ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. వాయిదా వేసిన రెండుకేసుల్లో వివరణ ఇవ్వాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 2019 హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అనుమతి లేకుండా రోడ్‌ షోలు నిర్వహించడం, సభల్లో ప్రసంగించిన నేపథ్యంలో ఆయనపై నేరేడుచర్ల, మఠంపల్లి తదితర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షలో భాగంగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టేయాలంటూ ఉత్తమ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 05:16 AM