20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:15 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు సోమవారం వెల్లడించింది.
తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానాలకు పోలింగ్
3న నోటిఫికేషన్.. 10 నుంచి నామినేషన్లు
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
కాంగ్రె్‌సకు నాలుగు సీట్లు దక్కే అవకాశం
జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్,
బండ్ల గణేశ్, సంపత్, షబ్బీర్ పేర్లు ప్రచారంలో..
రెండు స్థానాల్లో పోటీ పడాలని బీఆర్‌ఎస్ యోచన
ఒక స్థానంలో సత్యవతి రాథోడ్‌కు మరోసారి అవకాశం
బీసీ అభ్యర్థినైనా నిలబెట్టే చాన్స్ ఉందని ప్రచారం
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు సోమవారం వెల్లడించింది. తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రె్‌సలో చేరారు. మీర్జా రియాజుల్ హాసన్ మజ్లిస్ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్ నేతలు.తెలంగాణలో ఐదు స్థానాలతోపాటు ఏపీలో ఐదు స్థానాలకు కలిపి మార్చి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మార్చి 10 చివరి తేదీ. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మార్చి 24వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే.. ఈ ఎన్నికల్లో అధిక సీట్లు అధికార కాంగ్రెస్ దక్కించుకోనుంది. ఒక్క స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం కనబడుతోంది. తమ స్థానాన్ని తమకే ఇవ్వాలని మజ్లిస్ పట్టుబడితే... ఆ మేరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందో? లేదో? వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార పార్టీ అభ్యర్థులుగా పలువురి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఓసీ కేటగిరీ నుంచి జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, బండ్ల గణేశ్, కుసుమ్ కుమార్, కుమార్‌రావు, బీసీల నుంచి అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్‌యాదవ్, ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్, మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్‌ఖాన్, షబ్బీర్‌అలీ, అజ్మతుల్లా రేసులో ఉన్నారు. అయితే, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకొని బీఆర్‌ఎ్‌సకు 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరి పార్టీని వీడిన వారందరూ అధికార పార్టీకి మద్దతు ఇస్తారా? లేక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ మళ్లీ సొంత పార్టీకి అండగా నిలుస్తారా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికే పరిమితం కాకుండా రెండో స్థానానికీ అభ్యర్థిని బరిలో నిలిపాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రాథమికంగా ఒక ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం సత్యవతి రాథోడ్‌కు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. బీసీ వాదంపై చర్చోపచర్చలు నడుస్తున్న వేళ బీసీ అభ్యర్థికైనా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమైన తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 10
నామినేషన్ల పరిశీలన: మార్చి 11 వరకు
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13 వరకు
పోలింగ్: మార్చి 20.. అదే రోజు సాయంత్రం 5 తర్వాత ఓట్ల లెక్కింపు