Vote Counting: రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:55 AM
వరంగల్- ఖమ్మం- నల్లగొండ, కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
మూడు షిఫ్టుల్లో లెక్కింపు!
ఫలితాలపై ఉత్కంఠ
నల్లగొండ/ కరీంనగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్- ఖమ్మం- నల్లగొండ, కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. నల్లగొండలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంఽధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రెండు, మూడురోజులు సమయం పట్టే అవకాశమున్నందున మూడు షిఫ్టుల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం బ్యాలెట్ బాక్సుల భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.