Cyber Crime: వృద్ధ దంపతులకు 50 గంటల డిజిటల్ అరెస్టు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:44 AM
వృద్ధ దంపతులను 50 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. వారి నుంచి రూ.30 లక్షలు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
రూ.30 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వృద్ధ దంపతులను 50 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. వారి నుంచి రూ.30 లక్షలు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తమనుతాము ముంబై పోలీసులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ‘‘మనీలాండరింగ్ కేసులో నగదు బదిలీ అయిన ఖాతాతో మీ ఆధార్ లింక్ అయ్యి ఉంది’’ అంటూ నకిలీ సీబీఐ నోటీసులను ఫోన్‌లో షేర్ చేశారు. ఆ దంపతులను ఆదివారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు 50 గంటల పాటు డిజిటల్ అరెస్టులో ఉంచారు. ఆ సమయంలో కోర్టు.. సీబీఐ.. ట్రాయ్.. ఆర్‌బీఐ పేర్లతో నకిలీ నోటీసులు పంపారు. ‘‘మీ బ్యాంకు ఖాతాను వెరిఫై చేయాల్సి ఉంది. మేము చెప్పే ఖాతాకు మీ బ్యాంకులోని డబ్బులను బదిలీ చేయండి. మీరు నిర్దోషులని తేలితే.. ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ ఇచ్చేస్తుంది’’ అని నమ్మించి, రూ.30 లక్షలను బదిలీ చేయించుకున్నారు. ఈడీ, ఆర్‌బీఐ పేరుతో రసీదులు కూడా ఇచ్చారు. అంతటితో ఆగని కేటుగాళ్లు.. ఆ వృద్ధ దంపతులకు బ్యాంకు లాకర్ ఉన్నట్లు గుర్తించి, ఆ బంగారంపై రుణం తీసుకోవాలని ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లు వృద్ధ దంపతులు చేస్తున్న క్రమంలో బాధితుల మిత్రుడు విషయం తెలుసుకుని, సైబర్‌క్రైమ్ టోల్‌ఫ్రీ నంబరు(1930)కి ఫిర్యాదు చేశారు. దీంతో.. నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధ దంపతులు రూ.30 లక్షలు బదిలీ చేసిన ఖాతాలో రూ.20 లక్షల బ్యాలెన్స్ మాత్రమే ఉండగా.. ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు.
ఫాల్కన్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల పేరుతో ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు మరో కీలక నిందితుడిని అరెస్టు చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) ఆర్యన్‌సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో ఆర్యన్‌సింగ్ అతని సంస్థ.. బ్యాంకు ఖాతాల్లో రూ.2.88 కోట్ల నిధులను మళ్లించి లాభపడ్డట్లు తెలిపారు. అతనికి పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా.. రూ.792 కోట్ల మేర మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కుంభకోణంపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే..!
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత