Share News

Medical Admission Scam: వైద్య విద్యలో నకిలీ దందా!

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:00 AM

వైద్య విద్య ప్రవేశాల్లో ప్రవాస భారతీయుల ఎన్నారై కోటా కింద జరిగిన భారీ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌..

Medical Admission Scam: వైద్య విద్యలో నకిలీ దందా!

  • ఫేక్‌ డాక్యుమెంట్లతో కుంభకోణం

  • ఎన్నారై కోటా కింద 18 వేల ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల భర్తీ

  • బెంగాల్‌, ఒడిశాలలో గుర్తింపు

  • ఏజెంట్లతో కాలేజీల కుమ్మక్కు

  • భారీ మొత్తంలో సొమ్ము దోపిడీ

  • బట్టబయలు చేసిన ఈడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వైద్య విద్య ప్రవేశాల్లో ప్రవాస భారతీయుల(ఎన్నారై) కోటా కింద జరిగిన భారీ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బట్టబయలు చేశారు. నకిలీ పత్రాలు, ఎన్నారై సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏకంగా 18 వేల సీట్లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు భర్తీ చేసినట్టు గుర్తించారు. ఈ సీట్లన్నీ ఎన్నారై కోటాలోనివేనని ఈడీ అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ, భారత విదేశీ వ్యవహారాల మిషన్‌తో కలిసి ఈ వ్యవహారంపై ఈడీ ముమ్మర దర్యాప్తు చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలలు.. నకిలీ పత్రాలు, నకిలీ ఎన్నారై సర్టిఫికెట్ల ఆధారంగా 18 వేల సీట్లలో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ దందాలో కొందరు ఎన్నారైల ప్రమేయం కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉందని, వారు ఎన్నారైలను సంప్రదించి వారికి కొంత మొత్తం సొమ్మును ముట్టజెప్పి వివరాలు తెలుసుకున్నట్టు నివేదికలో వివరించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందగానే పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో దాడులు చేసిన ఈడీ అధికారులు.. వందల కొద్దీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని, వాటిని భారత దౌత్య కార్యాలయాలకు పంపించారు. వీటిలో ఎక్కువగా నకిలీవే ఉన్నాయని తెలిపారు. అమెరికాకు చెందినవి పేర్కొన్న సర్టిఫికెట్లలో నకిలీ నోటరీలనూ గుర్తించారు. ప్రవాస భారతీయులతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న సర్టిఫికెట్లు కూడా నకిలీవేనని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఒకే తరహా సర్టిఫికెట్లను ఎక్కువ మంది వినియోగించారని గుర్తించారు. ‘స్పాన్సర్స్‌’ పేరుతో కళాశాలల తరఫున ఏజెంట్లే చక్రం తిప్పారని, భారీ మొత్తంలో సొమ్మును దోచుకున్నారని తెలిపారు. అయితే, స్పాన్సర్లు ఎవరూ సొమ్ము చెల్లించలేదని, విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించారని పేర్కొన్నారు. ఫలితంగా ఎన్నారై కోటా అసలు ఉద్దేశం గాడి తప్పిందని ఈడీ అధికారులు తెలిపారు. అయితే, ఇంత మోసం జరిగినప్పటికీ ఒడిశా, బెంగాల్‌ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీలకు సంబంధించి.. రూ.18.75 కోట్లను ఫ్రీజ్‌ చేసినట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:00 AM