Srishti Fertility Centre: ‘సృష్టి’ కేసులో మరో డాక్టర్ అరెస్ట్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:04 AM
సృష్టి ఫర్టిలిటీ కేంద్రం కేసులో మరో మహిళాడాక్టర్ అరెస్టయ్యారు. ఈ కేసులో డాక్టర్ విధులత పాత్ర ఇదివరకే వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఆమెపై లుకౌట్ నోటీసు జారీ చేశారు.
శంషాబాద్‌లో అదుపులోకి విధులత.. ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
హైదరాబాద్‌సిటీ/అడ్డగుట్ట/శంషాబాద్ రూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ కేంద్రం కేసులో మరో మహిళాడాక్టర్ అరెస్టయ్యారు. ఈ కేసులో డాక్టర్ విధులత పాత్ర ఇదివరకే వెలుగులోకి రావడంతో.. పోలీసులు ఆమెపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్ విధులత సోమవారం సాయంత్రం విశాఖ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసు ఉండడంతో ఎయిర్‌పోర్టు భద్రతను పర్యవేక్షించే సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది గోపాలపురం పోలీసులకు సమాచారం అందజేశారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి, గోపాలపురం స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదైనప్పుడే విధులత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె నమ్రతకు బినామీ డాక్టర్ అని తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఆమె పిల్లల్లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. నమ్రత కస్టడీ ముగిశాక చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించనున్నారు. ఆమె కుమారుడు జయంత్‌కృష్ణ, ఇతర నిందితులను కూడా కస్టడీకి తీసుకుని, విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
4 కేసులు.. 15 అరెస్టులు
సృష్టి కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నల్లగొండకు చెందిన ఓ జంట.. తమ వద్ద నమ్రత రూ.44 లక్షలు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. మరో జంట రూ.18లక్షలు, ఓ ఎన్నారై జంట రూ.25 లక్షల చొప్పున నమ్రతకు ముట్టజెప్పినట్లు వివరించారు. ఈ ఫిర్యాదులతో కలిపి పోలీసులు మొత్తం 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇవి కాకుండా సృష్టి ఫర్టిలిటీ కేంద్రంపై తెలుగు రాష్ట్రాల్లో పదికిపైగా ఠాణాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో.. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, విశాఖకు చెందిన కళ్యాణి అచ్చాయమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, గాంధీ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం, అసోంకు చెందిన ధనశ్రీ సంతోషి, మహమ్మద్ అలీ ఆదిక్, నస్రీన్ బేగం.. ఇలా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా విధులత, కృష్ణ, శేషగిరిరావు, శ్రీనివాస్, సురేఖ, నయీందాస్, ఆశాబేగం ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News