ఇమేజింగ్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సలో అనూహ్య మార్పులు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:36 AM
ఇమేజింగ్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్స, ఔషధాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ పేర్కొన్నారు.

జాన్ హాప్‌కిన్స్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్ నిమ్మగడ్డ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఇమేజింగ్ టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్స, ఔషధాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ పేర్కొన్నారు. జేఎన్‌టీయూ బయోటెక్నాలజీ విభాగంలో ‘ఇమేజింగ్ ఫర్ డ్రగ్ డెవల్‌పమెంట్’ అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇమేజింగ్ టెక్నాలజీ ఆధారంగా ఔషధాల అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సను మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు అధునాతన వైద్య పద్ధతులను అవలంబిస్తున్నారని ఆయన తెలిపారు.
ఆధునిక క్యాన్సర్ చికిత్సలు అత్యంత ఖరీదైనవని, ఒక రోగికి ఏడాదికి రూ.1.20 కోట్ల వరకు ఖర్చవుతోందన్నారు. శరీరంలోని క్యాన్సర్ కణాలను సరైన సమయంలో గుర్తించేందుకు ఇమేజింగ్ టెక్నాలజీ దోహదపడుతుందని, దీని కోసం పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఇమేజింగ్‌ను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ చికిత్స ఫలితాలపై ఆహారం, గట్ మైక్రోబయోమ్ ముఖ్యమైన ప్రభావం చూపుతాయని ఇటీవలి అధ్యయనాలు నిరూపించాయని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. అధిక మాంసాహారం ప్రతికూల ప్రభావం చూపడంతో క్యాన్సర్ చికిత్స సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు.