Share News

Dr. Maru: నాస్తికోద్యమ నాయకురాలు డాక్టర్‌ మారు మృతి

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:34 AM

ప్రముఖ వైద్యురాలు, సామాజిక సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు సరస్వతి గోరా 4వ కుమార్తె డాక్టర్‌ మారు (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె డాక్టర్‌ సమరానికి సోదరి.

Dr. Maru: నాస్తికోద్యమ నాయకురాలు డాక్టర్‌ మారు మృతి

విజయవాడ (పటమట), ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వైద్యురాలు, సామాజిక సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు సరస్వతి గోరా 4వ కుమార్తె డాక్టర్‌ మారు (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె డాక్టర్‌ సమరానికి సోదరి. వీరిద్దరూ విజయవాడలో 55 ఏళ్లుగా వాసవ్య నర్సింగ్‌ హోం ద్వారా సేవలందిస్తున్నారు. డాక్టర్‌ మారు.. అనేక గ్రామాల్లోను, గిరిజన ప్రాంతాల్లోను సేవలందించడమే కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకు ఎంతో కృషిచేశారు. కొన్ని వేలమంది పోలియో కలిగిన చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స చేయించారు. శుక్లాల ఆపరేషన్లు వేలల్లో చేయించడమే కాకుండా, వందలాది మందికి నర్సింగ్‌ ట్రైనింగ్‌ అందించడంలోనూ ఆమెది కీలకపాత్ర.


నాస్తికోద్యమ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మృతి విషయం తెలియగానే, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. ఆమె నేత్రాలను స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ప్రముఖ సంఘ సేవకుడు, ఆమె భర్త శ్రీహరి సుబ్రహ్మణ్యం, కుమారుడు డాక్టర్‌ ఓలాస్‌ గోరా, కోడలు డాక్టర్‌ సుదీప్తి వర్థన్‌, మనుమడు సాహస్‌.. తుది గడియాల్లో ఆమె చెంతనే ఉన్నారు. ఆమె అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని నాస్తిక కేంద్రం నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Feb 07 , 2025 | 04:34 AM