Share News

ఒకే పిల్లర్‌పై ఫ్లై ఓవర్‌, మెట్రో కారిడార్‌!

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:13 AM

హెచ్‌-సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఐటీ కారిడార్‌లో డబుల్‌ డెక్కర్‌ వంతెన అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌లోని విప్రో జంక్షన్‌ వద్ద ఒకే పిల్లర్‌పై ఫైఓవర్‌ను, మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఒకే పిల్లర్‌పై ఫ్లై ఓవర్‌, మెట్రో కారిడార్‌!

  • విప్రో చౌరస్తాలో డబుల్‌ డెక్కర్‌ నిర్మాణం

  • కింద వాహనాలు.. పైన మెట్రోరైల్‌

  • హెచ్‌-సిటీలో అధికారుల ప్రతిపాదన

  • నగరంలో అందుబాటులోకొచ్చే తొలి డబుల్‌ వంతెన ఇదే!

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): హెచ్‌-సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఐటీ కారిడార్‌లో డబుల్‌ డెక్కర్‌ వంతెన అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌లోని విప్రో జంక్షన్‌ వద్ద ఒకే పిల్లర్‌పై ఫైఓవర్‌ను, మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు. వాహనాలు, మెట్రో రైల్‌ ఒకే నిర్మాణంపై రాకపోకలు సాగించేలా ప్రాజెక్టును డిజైన్‌ చేస్తున్నారు. ఆస్తుల సేకరణ అవసరం లేకుండా, తక్కువ వ్యయంతో నిర్మించేలా దీనిని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) వర్గాలతో పలుమార్లు చర్చించామని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. సాధారణ వంతెన కంటే ఎక్కువ పటిష్ఠంగా ఫౌండేషన్లు, పిల్లర్లు, పియర్‌ క్యాప్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వంతెనపై వాహనాల రాకపోకలకు రోడ్డు మార్గం.. దానిపైన నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు అనుగుణంగా స్ట్రక్చరల్‌ డిజైన్‌ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక డిజైన్‌ రూపొందించామని, హెచ్‌ఎంఆర్‌ అధికారులతో తిరిగి సమావేశమై ఖరారు చేస్తామని ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే నగరంలో మొట్ట మొదటఅందుబాటులోకి వచ్చే డబుల్‌ డెక్కర్‌ వంతెన ఇదే అవుతుందని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. విప్రో జంక్షన్‌ వద్ద ఐఎ్‌సబీ వైపు రోడ్డు నుంచి కాగ్నిజెంట్‌ చౌరస్తా వరకు 1.05 కి.మీల మేర ఫ్లై ఓవర్‌ ప్రతిపాదించారు. రాయదుర్గ్‌ నుంచి కోకాపేట నియోపాలిస్‌ వరకు ఫేజ్‌-2లో ప్రతిపాదించిన మెట్రో కారిడార్‌ ఈ మార్గంలోనే ఉంది.


ఖాజాగూడ నుంచి నియోపాలిస్‌ వరకు..

రాయదర్గ్‌ నుంచి ఖాజాగూడ, నానక్‌రాంగూడ, విప్రో జంక్షన్‌, కాగ్నిజెంట్‌ చౌరస్తా, ఔటర్‌ కోకాపేట ఎగ్జిట్‌-1, ఖానాపూర్‌ మీదుగా కోకాపేట నియోపాలిస్‌ వరకు మెట్రో కారిడార్‌ నిర్మించనున్నారు. నానక్‌రాంగూడ నుంచి వచ్చే మెట్రో కారిడార్‌ విప్రో జంక్షన్‌ వద్ద ఎడమ వైపునకు తిరిగి కోకాపేట ఎగ్జిట్‌ వైపు వెళ్తుంది. విప్రో జంక్షన్‌ నుంచి కాగ్నిజెంట్‌ చౌరస్తా వరకు మెట్రో, వంతెన కలిపి నిర్మించనున్నారు. కాగ్నిజెంట్‌ చౌరస్తా ముందు వంతెన దిగే వాహనాలు అక్కడ నిర్మించనున్న అండర్‌పాస్‌ మీదుగా ఔటర్‌ ఎక్కుతాయి. ఔటర్‌ నుంచి వచ్చే వాహనాలు కోకాపేట ఎగ్జిట్‌-1 వద్ద దిగి కాగ్నిజెంట్‌ చౌరస్తాలోని అండర్‌పాస్‌, అనంతరం వంతెన మీదుగా ఐఎ్‌సబీ వైపు సులువుగా వచ్చే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పడుతుందని అధికారులు చెబుతున్నారు. వంతెనలు, మెట్రో కారిడార్‌ వేర్వేరుగా చేపట్టిన పక్షంలో భారీ స్థాయిలో ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.వందల కోట్లు వెచ్చించాలి. డబుల్‌ డెక్కర్‌ వంతెనతో.. ఆస్తుల సేకరణ భారం ఉండదని, నిర్మాణ వ్యయమూ తగ్గుతుందని ఓ అధికారి తెలిపారు. మేడ్చల్‌, శామిట్‌పేట మార్గాల్లో నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్లనూ మెట్రోతో పాటు కలిపి డిజైన్‌ చేస్తున్నారు. ఆయా మార్గాల్లోనూ డబుల్‌ డెక్కర్‌ వంతెనల ప్రతిపాదనలున్నాయి.

Updated Date - Feb 15 , 2025 | 04:13 AM