Hanumkonda: కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన డాక్టర్
ABN , Publish Date - May 05 , 2025 | 04:11 AM
హనుమకొండ జిల్లా కమలాపూర్ సివిల్ ఆస్పత్రిలో వైద్యురాలికి నిర్లక్ష్యం వల్ల ఒక బాలింత ప్రాణాపాయాన్ని ఎదుర్కొంది. ప్రసవం సమయంలో వైద్యురాలు కడుపులో కాటన్ ఉంచి కట్లు వేసిన తర్వాత బాలింత తీవ్ర నొప్పులతో తిరిగి ఆస్పత్రిపాలైంది
వైద్యురాలి నిరక్ష్యం బాలింతకు ప్రాణసంకటం
హనుమకొండ జిల్లా కమలాపూర్ సివిల్ ఆస్పత్రిలో ఘటన
ఎల్కతుర్తి, మే 4 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో వైద్యురాలి సిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవం అప్పుడు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు.. బాలింత కడుపులో కాటన్‌ను ఉంచి కట్లు వేసింది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో ఆ బాలింత తిరిగి ఆస్పత్రిపాలైంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ సివిల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వానరాసి తిరుమలను ప్రసవం కోసం కుటుంబసభ్యులు ఏప్రిల్ 27 మధ్యాహ్నం కమలాపూర్ సివిల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తిరుమలకు నొప్పులు అధికమయ్యాయని నర్సులు ఇచ్చిన సమాచారంతో రాత్రి ఎనిమిది గంటలకు ఆస్పత్రికి చేరుకున్న వైద్యురాలు.. తిరుమలకు చిన్న శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. అనంతరం శస్త్రచికిత్స చేసిన చోట రక్తస్రావం కాకుండా ఉండేందుకు కడుపులోనే కాటన్ ఉంచి కుట్లు వేసేశారు.
మూడు రోజుల అనంతరం తిరుమల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి తీవ్రమైన కడుపునొప్పితో సతమతమవుతున్న తిరుమల.. ఆదివారం మూత్ర విసర్జనకు వెళ్లగా శస్త్రచికిత్స చేసిన చోటు నుంచి కాటన్ బయటకు వచ్చింది. దీంతో తిరుమలను కుటుంబసభ్యులు తిరిగి కమలాపూర్ ఆస్పత్రికి తీసుకురాగా.. పరిశీలించిన ఓ నర్సు కాటన్‌ను బయటికి లాగేసింది. దీంతో కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన వైద్యురాలు, ఇతర సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.