జయహో మల్లన్న.. మమ్మేలు మల్లన్న.. !
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:50 AM
జయహో మల్లన్న.. మమ్మేలు మల్లన్న.. కొమురెల్లి మల్లన్న.. అంటూ భక్తుల జయజయధ్వానాలతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్న పెద్దపట్నం గురువారం తెల్లవారు జామున కన్నుల పండువగా జరిగింది.
వైభవంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం
చేర్యాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జయహో మల్లన్న.. మమ్మేలు మల్లన్న.. కొమురెల్లి మల్లన్న.. అంటూ భక్తుల జయజయధ్వానాలతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్న పెద్దపట్నం గురువారం తెల్లవారు జామున కన్నుల పండువగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున ఒగ్గుపూజారులు ఆలయ తోటబావి ప్రాంగణంలో యాదవ సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం ఘనంగా జరిపారు.
లింగోద్భవ సమయంలో గర్భాలయంలో వీరశైవార్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశరుద్రాభిషేకం, పల్లకీసేవ తదితర పూజలు జరిపారు. పెద్దపట్నాన్ని తిలకించిన భక్తులు మల్లన్నను స్తుతిస్తూ పట్నంపై చిందేస్తూ తన్మయత్వం చెందారు. పట్నం తొక్కిన శివసత్తులు, పోతురాజుల సిగాలతో పాటు మల్లన్న నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలు మిన్నంటాయి.