Konda Surekha: డిప్యూటేషన్లు నిలిపేయండి
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:12 AM
దేవాదాయ శాఖలోకి ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ల ప్రక్రియ నిలిపివేయాలని మంత్రి కొండా సురేఖకు దేవాదాయ అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడిగా తమ శాఖలో పనిచేస్తోన్న వారిలోనే అర్హులను గుర్తించి పదోన్నతులు కల్పించాలని కోరారు.
అర్హులకు పదోన్నతులు ఇవ్వాలి
సురేఖకు అధికారుల వినతి
గోడు వెళ్లబోసుకున్న వంద మందిపైగా అధికారులు
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : దేవాదాయ శాఖలోకి ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ల ప్రక్రియ నిలిపివేయాలని మంత్రి కొండా సురేఖకు దేవాదాయ అధికారులు, సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడిగా తమ శాఖలో పనిచేస్తోన్న వారిలోనే అర్హులను గుర్తించి పదోన్నతులు కల్పించాలని కోరారు. డిప్యూటేషన్లు సరికాదంటూ ఈవోలు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వంద మందికి పైగా సిబ్బంది శుక్రవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖను కలిసారు. సొంత శాఖలో తమకు ఎదురవుతోన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దేవాదాయ శాఖలో ఖాళీల పేరుతో.. ఆయా పోస్టులకు అర్హులైన వారిని డిప్యూటేషన్‌పై పంపించాలని కోరుతూ ఆరు వేర్వేరు విభాగాలకు ఉన్నతాధికారులు ఈ నెల 9న లేఖలు రాశారు. ఇతరులు ఇక్కడికి వస్తే... తమ శాఖలో ఏళ్లుగా పనిచేస్తోన్న వందలాది మందికి అన్యాయం జరుగుతుందని దేవాదాయ అధికారులు మంత్రి వద్ద వాపోయారు.
అనుభవం ఉన్నవారికి పదోన్నతులు కల్పించడంతో పాటు ఇప్పటికే డిప్యూటేషన్‌పై పని చేస్తోన్న వారిని వెనక్కి పంపించాలని కోరారు. డిప్యూటేషన్ విధానం నిబంధనలకు విరుద్ధమని, ఇదే విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రికి వివరించారు. మంత్రితో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ను సైతం కలిసి ఇదే విషయమై వినతిపత్రం అందజేశారు. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం. రామకృష్ణ రావు, డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత రావు, ఎన్. సంధ్య, అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు, తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ తదితరులు మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
డిప్యూటేషన్లకు తాత్కాలిక బ్రేక్...
పెద్ద సంఖ్యలో అధికారులు మంత్రిని కలిసి సమస్య విన్నవించడంతో కొండా సురేఖ వారికి భరోసా కల్పించారు. సమస్య కొలిక్కి వచ్చే వరకు డిప్యూటేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి