Panchayat Elections: పంచాయతీ పోరు.. పరీక్షల తర్వాతే?
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:07 AM
ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు మరో 25 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే
3 విడతల్లో నిర్వహించాలని ఈసీ యోచన
బ్యాలెట్ బాక్సుల సేకరణ, బూత్‌ల గుర్తింపు పూర్తి
కొనసాగుతున్న ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణలు
హైదరాబాద్, పిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలు మరో 25 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మార్చి 5న మొదలయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు ముందు పెడతారా? మార్చి 21న మొదలై ఏప్రిల్ 4 వరకు సాగే పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక చేపడతారా? అనేది తేలాల్సి ఉంది. రిజర్వేషన్ల ఖరారు కోసం ఉద్దేశించిన ప్రత్యేక కమిషన్ సోమవారమే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్థానిక పరిస్థితులు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ కసరత్తు పూర్తి చేయడానికే పంచాయతీరాజ్ శాఖకు కనీసం పది రోజుల సమయం పడుతుందని అంచనా. అన్నీ సిద్ధం చేసుకొనే సరికి ఇంటర్ పరీక్షలు వస్తాయి. వెనువెంటనే పదో తరగతి పరీక్షలు. ఇప్పటికే ఎన్నికల విధులకు జూనియర్ లెక్చరర్లను, ఉపాధ్యాయులను వినియోగించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఇంటర్ పరీక్షల ప్రారంభానికి ముందు గానీ, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక గానీ చేపట్టాల్సి ఉంటుంది. 25 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే ఏర్పాట్లు చేసేసింది. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. నోటిఫికేషన్‌కు ఎన్నికల నిర్వహణకు మధ్య రెండు వారాల వ్యవధి ఇచ్చారు. ఒక్కో దశ ఎన్నికకు మధ్య 5 రోజుల విరామం ఇచ్చారు. జిల్లాల వారీగా ఎక్కడి బ్యాలెట్ బాక్సులను అక్కడే ఉపయోగించారు. మూడు దశల్లో పోలింగ్ అయ్యాక ఒకేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కలిపి 2 విడతల్లో నిర్వహించారు. అయితే, ఈ సారి ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలను బట్టి, నిర్వహణకు అందుబాటులో ఉన్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. అంటే, పరీక్షలకు ముందు స్వల్ప వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే దాన్ని రెండు విడతలకు కుదించే అవకాశం ఉంది. లేదా రెండు విడతల్లో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను ఇంటర్ పరీక్షలకు ముందే నిర్వహించి పంచాయతీ ఎన్నికలను పరీక్షల సీజన్ ముగిసేదాకా వాయిదా వేసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలను ఏప్రిల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మరి కొన్ని నెలల తర్వాత నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.
ఎన్నికల సంఘం రెడీ
పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది వివరాల సేకరణ, ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి నియామకం పూర్తయింది. రెండు రోజుల్లో శిక్షణ పూర్తవుతుంది. బ్యాలెట్ బాక్స్‌లతో మూడు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందించుకుంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా బ్యాలెట్ బ్యాక్సులు తెప్పించారు. పంచాయతీ ఎన్నికలతో సంబంధం లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడుతల్లో, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే విడతలో విడివిడిగా చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ఒక అధికారి పర్యవేక్షణలో జరిగితే, పోలింగ్ మరో అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. వీరిద్దరే కాకుండా పోలింగ్ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతీ 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ సిబ్బంది ఉంటారు. ఓటర్ల సంఖ్య 650 దాటితే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News