Cyber Crime: రవాణాశాఖ పేరుతో సైబర్ మోసం
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:37 AM
ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రమాదకరంగా మారుతున్న ఏపీకే ఫైల్స్
ఆర్టీవో, ఆర్టీఏ ఈ-చలానా ఆఫీస్ పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు
ఏపీకే ఫైల్స్ పంపించి మొబైల్ హ్యాకింగ్, ఖాతాలు ఖాళీ
నకిలీ ఫైళ్లను తెరవొద్దు: అధికారులు
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు. వన్ టైం పాస్‌వర్డ్(ఓటీపీ)లను అపరిచితులతో పంచుకోవద్దని ప్రజల్లో విస్తృతంగా అవగాహన ఏర్పడ్డ నేపథ్యంలో కేటుగాళ్లు ఏపీకే ఫైల్స్ రూపంలోకి రూటు మార్చారు. స్మార్ట్ ఫోన్లకు హ్యాక్ చేేసందుకు కొత్త ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఏపీకే(ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైల్స్ లింకులను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. వీటి ద్వారా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఫోన్లపై నియంత్రణ సాధించి, వినియోగదారుల బ్యాంకు వివరాలు దోచుకుంటున్నారు. అలాగే రవాణా శాఖ అంటూ ప్రభుత్వ విభాగాల పేరుతో వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపిస్తున్నారు. ఆర్టీవో పేరుతో మెసేజ్ వచ్చిందని తొందరపడి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు మొబైల్ హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆర్టీఏ చలానా పేరుతో వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆ లింక్ క్లిక్ చేస్తే అతని ప్రమేయం లేకుండానే ఫోన్‌లో ఓ యాప్ ఇన్‌స్టాల్ అయింది. యాప్‌లో అడిగిన వివరాలు నమోదు చేసిన రెండు రోజుల్లో ఖాతాలో రూ. 1.72 లక్షలు కేటుగాళ్లు కొట్టేశారు. విషయం గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీ్‌సలకు ఫిర్యాదు చేశాడు. ఇలా రవాణా శాఖతోపాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, పీఎం కిసాన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు, ఎస్‌బీఐ రివార్డుల పేరుతోనూ ఏపీకే ఫైల్స్ పంపించి నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
రెండో వ్యక్తి నియంత్రణలోకి..
సాధారణంగా మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడం అంత సులువు కాదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో కంపెనీ నుంచి వచ్చే అప్లికేషన్లు(యాప్స్) మినహా.. మిగతా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే అదనుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. టెలిగ్రాం, వాట్సా్‌పతో పాటు ఇతర సోషల్ మీడియాల్లో వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు. లింకును తెరిచి ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో అందులో ఉన్న యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీంతో వెంటనే ఫొన్లో ఉన్న కాంటాక్ట్స్, గ్యాలరీతో పాటు అన్నిరకాల అనుమతులు సెల్ ఫోన్ యజమాని ప్రమేయం లేకుండానే ఇతరుల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దని అధికారులు సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశారు.