Share News

Secretariat: సచివాలయంలో పగుళ్లు!

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:00 AM

రాష్ట్ర సచివాలయ నూతన భవనంలో చాలా చోట్ల పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. డిజైన్‌ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్‌లతోపాటు కొన్ని గోడల్లోనూ ఈ పగుళ్లు వచ్చినట్లు సమాచారం.

Secretariat: సచివాలయంలో పగుళ్లు!

  • భవనంలో చాలా చోట్ల ఉన్నాయ్‌

  • బయటకు అందంగా కనిపించేందుకు నట్లు, బోల్టులతో రెయిలింగ్‌ల ఏర్పాటు

  • వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పు పట్టి ఊడిపడిన జీఎ్‌ఫఆర్‌సీ ఫ్రేమ్‌

  • భవనం లోపల పిల్లర్ల ఫ్రేమ్‌లకు పగుళ్లు.. ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ నూతన భవనంలో చాలా చోట్ల పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. డిజైన్‌ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్‌లతోపాటు కొన్ని గోడల్లోనూ ఈ పగుళ్లు వచ్చినట్లు సమాచారం. ఇటీవల సచివాలయం రెయిలింగ్‌ పెచ్చులు ఊడిపడిన ఘటనపై విచారణ జరిపిన కమిటీ.. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ‘‘సచివాలయంలో చాలా చోట్ల పగుళ్లు ఉన్నాయి. కొన్ని పిల్లర్లకు అమర్చిన మోడల్‌ ఫ్రేమ్‌లకూ పగుళ్లు వచ్చాయి. బయటికి అందంగా కనిపించేందుకు అంతస్తుల వారీగా ఏర్పాటు చేసిన రెయిలింగ్‌లకు లోపలి వైపు నట్లు, బోల్టులను అమర్చారు. ఐదో అంతస్తు నుంచి ఊడిపడిన జీఎ్‌ఫఆర్‌సీ ఫ్రేమ్‌ లోపలివైపు కూడా నట్లు, బోల్టులతో అమర్చారు. అవి వర్షానికి తడిసి, ఆ నీరు లోపలికి చేరడంతో నట్లు, బోల్టులు తుప్పు పట్టాయి. దీంతో బరువును మోయలేక అవి ఊడిపడ్డాయి. ఆ కారణంగానే గ్లాస్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (జీఎ్‌ఫఆర్‌సీ)తో ఉన్న ఫ్రేమ్‌ ఊడి పడింది’’ అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొంది. ఈ నెల 13న సాయంత్రం సచివాలయం దక్షిణభాగం వైపు పోర్టికో పక్కన ఐదో అంతస్తుపై మోడల్‌ కోసం జీఆర్‌ఎ్‌ఫసీతో అమర్చిన రెయిలింగ్‌ పెచ్చులు ఊడిపడిన విషయం తెలిసిందే. ఆ పెచ్చులు అక్కడే నిలిపి ఉంచిన రామగుండం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం తిరుపతి కారుపై పడడంతో.. కారు కొంతమేర దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఘటన ఎలా జరిగింది, పెచ్చులు ఎలా ఊడిపడ్డాయనే అంశాలపై సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు.


మరోవైపు ఆర్‌అండ్‌బీ, ఐటీ శాఖతోపాటు సచివాలయాన్ని నిర్మించిన సంస్థ ప్రతినిధులతో కలిపి ఉన్నతాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సచివాలయం లోపల డిజైన్‌ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్‌లలోనూ చాలా పగుళ్లు ఉన్నాయని విచారణ కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ ఫ్రేమ్‌లలో పగుళ్లు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. బాల్కనీల్లో రూఫ్‌టా్‌పకు అమర్చిన కొన్ని డిజైన్లు కూడా వంకర్లు తిరిగి, ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని గోడల్లోనూ పలుచోట్ల పగుళ్లు కనిపిస్తుండడం గమనార్హం. కాగా, సచివాలయం లోపలి వైపు పగుళ్లన్నింటికీ మరమ్మతులు చేపట్టాలని కమిటీ సూచించింది. అయితే ఆయా మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని సదరు నిర్మాణ సంస్థే భరించాల్సి ఉంది. నిర్మాణ సమయంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలోనూ ఈ నిబంధన ఉందని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విచారణ కమిటీ తేల్చిన పగుళ్లు, వాటి మరమ్మతులకు సంబంధించి అన్ని పనులనూ త్వరితగతిన పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2019లో నూతన సచివాలయం కోసం శంకుస్థాపన చేయగా.. 2023 ఏప్రిల్‌ 30న భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభమై రెండేళ్లు కూడా కాకముందే ఫ్రేమ్‌లు ఊడిపడడం, పగుళ్లు రావడంతో నిర్మాణ నాణ్యతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సచివాలయ భవనం నిర్మాణం కోసం సుమారు రూ.1500కోట్లు ఖర్చు చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 04:00 AM