నెల రోజుల్లోగా ‘సీతారామ’కు సాంకేతిక అనుమతులు
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:13 AM
సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు నెల రోజుల్లోగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక అనుమతులు నెల రోజుల్లోగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. అలాగే, మేడిగడ్డ కుంగుబాటుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక నెలాఖరులోగా రాష్ట్రానికి అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న అఖిలభారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సుకు విచ్చేసిన కేంద్ర మంత్రి పాటిల్‌తో ఉత్తమ్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులతోపాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ డిజైన్లు/డ్రాయింగ్‌లు పరిశీలించాకే సీతారామకు సాంకేతిక అనుమతులు ఇస్తామని సాంకేతిక సలహామండలి(టీఏసీ) చెప్పిందని, అన్నిరకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి నెలరోజుల్లోగా సాంకేతిక అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు జరిగి ఏడాదైందని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదిక అందిస్తే తమ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. నిపుణుల కమిటీ నివేదికను నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర మంత్రి బదులిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కల్పించుకొని.. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా రుణాలు చెల్లించేలా ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు లభించేలా చేస్తామని తెలిపారు. కాగా, మూసీ పునరుజ్జీవన పథకానికి కేంద్రం సహాయం అందించాలని ఉత్తమ్ కోరగా.. ఆ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి బదులిచ్చారు.