Share News

CPI: టెర్రరిస్టులతో చర్చలకు సిద్ధమన్న వారు... నక్సలైట్లతో మాత్రం సిద్ధంగా లేరు

ABN , Publish Date - May 25 , 2025 | 03:53 AM

కేంద్ర ప్రభుత్వం ఒక్క నక్సలైట్‌ పేరుతో పదిమంది గిరిజనులను చంపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఎంతమంది నక్సలైట్లను చంపినా ఉద్యమం ఆగదన్నారు.

CPI: టెర్రరిస్టులతో చర్చలకు సిద్ధమన్న వారు... నక్సలైట్లతో మాత్రం సిద్ధంగా లేరు

  • నక్సల్స్‌ పేరిట గిరిజనుల హత్యలు

  • గిరిప్రసాద్‌ వర్ధంతి సభలో నారాయణ

  • మవోయిస్టులతో చర్చలపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు: కూనంనేని

ఖమ్మం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఒక్క నక్సలైట్‌ పేరుతో పదిమంది గిరిజనులను చంపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఎంతమంది నక్సలైట్లను చంపినా ఉద్యమం ఆగదన్నారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన నల్లమల గిరిప్రసాద్‌ 29వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా వారితో చర్చించడానికి సిద్ధంగా లేరు కానీ టెర్రరిస్టులతో రాజీ పడుతున్నారన్నారని విమర్శించారు. బీజేపీ ఒక ఫాసిస్టు పార్టీ అని విమర్శించారు. మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా, వారు శాంతి చర్చలకు సిద్ధమంటే ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. నాడు నిజాం ప్రభుత్వ పంథాను నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. గిరిప్రసాద్‌ లాంటి ఎంతోమంది పోరాట యోధుల వారసత్వంతో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.


ఛత్తీస్‌గఢ్‌లోని జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీలో వారు విలేకరులతో మాట్లాడారు. వర్సిటీ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారిణి విజయలక్ష్మిని హత్య చేయడం పట్ల తెలంగాణ రాజకీయ పార్టీలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మారణకాండపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులను నిర్మూలించడానికి బహిరంగ ముహూర్తాలు పెడుతుండడం, నంబాల కేశవరావు హత్యపై హర్షాతిరేకాలు ప్రకటించడం శోచనీయమని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో రికార్డింగ్‌ ద్వారా వారి బంధుమిత్రుల సమక్షంలో శవ పంచనామా జరిపి, భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని విమలక్క, పటోళ్ల నాగిరెడ్డి, మల్లేశం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 03:53 AM