Share News

Land Acquisition: ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి!

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:00 AM

ప్రభుత్వ అవసరాల నిమిత్తం 35 ఏళ్ల క్రితం పట్టా భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.

Land Acquisition: ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి!

35 ఏళ్లుగా పట్టా భూమికి పరిహారం ఇవ్వని అధికారులు

  • కోర్టును ఆశ్రయించిన చిన్నకోడెపాక బాధితులు

  • ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తునకు కోర్టు ఆదేశం

  • ఆర్డీవో గడువు కోరడంతో జప్తు ప్రక్రియ వాయిదా

కృష్ణకాలనీ(భూపాలపల్లి), జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అవసరాల నిమిత్తం 35 ఏళ్ల క్రితం పట్టా భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం కింద ఆర్డీవో కార్యాలయంలోని ఫర్నిచర్‌, ఇతర వస్తువులను జప్తు చేయాలని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జప్తు చేయడానికి వచ్చిన సిబ్బంది... ఆర్డీవో కొంత సమయం ఇవ్వాలని కోరడంతో వెనుదిరిగారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన కుంటపల్లి విజయలక్ష్మి కథనం మేరకు.. ఆమెతో పాటు సంబంధీకులైన కుంటపల్లి లక్ష్మి, పెండ్యాల వసంత నుంచి వారి వారసత్వ ఆస్తి అయిన 11 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వ అవసరాలకు 1988లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఎకరానికి రూ.17 వేలు పరిహారం ఇస్తామని చెప్పినా.. జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో విజయలక్ష్మి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆమెకు రావాల్సిన పరిహారం సొమ్ము వడ్డీ కలిపి మొత్తం రూ.22, 65,253 చెల్లించాలని ఈ నెల 12న ఆదేశించింది. చెల్లించని పక్షంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌, బొలేరో వాహనం, ఇతరత్రా వస్తువులు జప్తు చేయాలని పేర్కొంది. దీంతో గురువారం ఆమె, కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదించేందుకు వచ్చే నెల 8 వరకు తనకు గడువు ఇవ్వాలని ఆర్డీవో కోరడంతో జప్తు చేయడానికి వచ్చిన సిబ్బంది వెనుదిరిగారు. ఉన్నతాధికారులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 05:00 AM