High Court: ఆ వివాదాల వల్ల విద్యార్థులు నష్టపోకూడదు
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:33 AM
రెండు విద్యాసంస్థల మధ్య వివాదాల కారణంగా.. ఆయా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు నష్టపోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సర్టిఫికెట్ల జారీకి అవకాశమివ్వండి: హైకోర్టు
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రెండు విద్యాసంస్థల మధ్య వివాదాల కారణంగా.. ఆయా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు నష్టపోకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మహబూబ్ కాలేజీ మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్, వెంకట్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి మధ్య వివాదాల కారణంగా మహబూబ్ కాలేజీ ఆధ్వర్యంలోని స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ), స్వామి వివేకానంద పీజీ కాలేజీ (ఎస్వీపీజీ) విద్యాసంస్థలకు చెందిన దాదాపు 1,800 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
సదరు విద్యాసంస్థల అసలు యజమాని అయిన పిటిషనర్ మహబూబ్ కాలేజీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని.. పిటిషనర్ సంస్థ అసలు ఈ-మెయిల్ ఐడీని పునరుద్ధరించడంతో పాటు విద్యార్థుల సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసే అవకాశమివ్వాలని జేఎన్‌టీయూ హైదరాబాద్, అఖిల భారత సాంకేతిక విద్యామండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.