Share News

High Court: సెకండ్‌ షోకు పిల్లల్ని అనుమతించొద్దు

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:18 AM

బెనిఫిట్‌, స్పెషల్‌ షోలకు అనుమతులివ్వడం, టికెట్ల రేట్ల పెంపుపై దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

High Court: సెకండ్‌ షోకు పిల్లల్ని అనుమతించొద్దు

  • 16 ఏళ్లలోపు వారిని రాత్రి 11 తర్వాత రానివ్వొద్దు

  • పుష్ప-2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం

  • తల్లి మరణం, చిన్నారి ప్రాణాపాయ స్థితి దారుణం

  • ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి

  • అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుంది: హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమా థియేటర్లలోకి అనుమతించరాదని నిషేధం విధిస్తూ హైకోర్టు సంచనల నిర్ణయం తీసుకుంది. పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. బెనిఫిట్‌, స్పెషల్‌ షోలకు అనుమతులివ్వడం, టికెట్ల రేట్ల పెంపుపై దాఖలైన పలు పిటిషన్‌లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు విజయ్‌ గోపాల్‌, సుల్తానా బాషా, మామిడాల మహేశ్‌, పి.శ్రీనివా్‌సరెడ్డి వాదిస్తూ.. వేళ కాని వేళలో సినిమాలకు వెళ్లే మైనర్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.


వాదనలు విన్న ధర్మాసనం.. ‘‘రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించడం భావ్యం కాదని ఈ కోర్టు భావిస్తోంది. ఉదయం 11 గంటలకు ముందు రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశాన్ని నియంత్రించే విధంగా అందరు స్టేక్‌ హోల్డర్లతో చర్చించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి తగిన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత థియేటర్లకు సంబంధిత వర్గాలకు రూల్స్‌ జారీ చేయాలి. సదరు ప్రక్రియ పూర్తయ్యే వరకు రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించడంపై నిషేధం విధిస్తున్నాం’’ అని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 03:18 AM