Share News

Film Nagar: ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంపై ‘పీఠ’ముడి

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:00 AM

నటుడు జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ట్రస్టీలుగా వ్యవహరించారు. మురళీమోహన్‌, చిరంజీవి సతీమణి సురేఖ, పరుచూరి గోపాలకృష్ణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చుక్కపల్లి సురేష్‌ తదితర 12 మంది బోర్డు సభ్యులుగా ఉన్నారు.

Film Nagar: ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానంపై ‘పీఠ’ముడి

  • ట్రస్టీగా శారదా పీఠాధిపతిని చైర్మన్‌ మోహన్‌బాబు తొలగించడంతో వివాదం

  • హంపీ పీఠం, సన్నిధానం కలిపి ఉన్న లోగో బయటికిరావడంతో దుమారం

  • నేడు నన్నిధానానికి విరూపాక్ష విద్యారణ్య భారతీ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని దైవసన్నిధానం పాలకమండలికి సంబంధించిన ఓ విషయం వివాదాస్పదంగా మారుతుంది. ఫిల్మ్‌నగర్‌ ఆలయం(దైవ సన్నిధానం) ట్రస్టీగా ఉన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు చైర్మన్‌ మోహన్‌బాబు లేఖ రాయగా దీనిపై శారదాపీఠం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరోపక్క, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన సంచలిత, ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానం పేరిట ఉన్న లోగో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో సన్నిధానం హంపీ పీఠం చేతుల్లోకి వెళుతుందనే దుమారం రేగింది. తెలుగు సినీ ప్రముఖులు జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో 2004లో దైవ సన్నిధానం ప్రారంభించారు. నటుడు జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ట్రస్టీలుగా వ్యవహరించారు. మురళీమోహన్‌, చిరంజీవి సతీమణి సురేఖ, పరుచూరి గోపాలకృష్ణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చుక్కపల్లి సురేష్‌ తదితర 12 మంది బోర్డు సభ్యులుగా ఉన్నారు.


మురళీమోహన్‌ పలుమార్లు బోర్డు చైర్మన్‌గా వ్యవహరించగా మోహన్‌బాబు 2018లో చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్లకోసారి ట్రస్టీలు, బోర్డు సభ్యులు కలిసి చైర్మన్‌ను నిర్ణయిస్తారు. అయితే, కరోనా తదనంతర పరిణామాల తర్వాత ఇప్పటిదాకా చైర్మన్‌ నియామకం జరగలేదు. మోహన్‌బాబు తనని తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు. అయితే, మోహన్‌బాబు చైర్మన్‌గా కొనసాగడాన్ని శారదాపీఠం తప్పుబట్టింది. దీంతో స్వరూపానందేంద్ర సరస్వతిని ట్రస్టీగా తొలగిస్తున్నామని చైర్మన్‌ మోహన్‌బాబు పీఠానికి లేఖ పంపారు. అయితే, ట్రస్టీని తొలగించే అధికారం చైర్మన్‌కు లేదని శారదాపీఠం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బోర్డు సభ్యులకు నోటీసులు పంపింది. ఈ కేసు విచారణలోనే ఉండగా.. దైవసన్నిధానాన్ని అధీనంలోకి తీసుకోవాలని బోర్డు పలు పీఠాలను సంప్రదించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హంపీ పీఠం నుంచి విరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి గురువారం ఆలయాన్ని సందర్శిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం విషయంలో పడిన పీఠముడి ఎలా వీడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Feb 13 , 2025 | 04:00 AM