Continuous Rains: అంటువ్యాధులొస్తున్నాయ్.. జాగ్రత్త!
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:06 AM
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు ఆందోళన రేపుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే నిలిచిపోయి కనిపిస్తున్నాయి.
ఎడతెరిపిలేని వానలు, వరదలు.. నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం
డయేరియా, కలరా వంటి సమస్యలు
వానలు తగ్గాక దోమలు, కీటకాల విస్తృతి..
డెంగీ, చికున్ గున్యా, మలేరియా ప్రబలే ప్రమాదం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైద్యులు
ఇప్పటికే ఆస్పత్రులకు జ్వర బాధితులు
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, పలుచోట్ల వరదలు ఆందోళన రేపుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉందికానీ ఇకపై మరో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు, సీజనల్ వ్యాఽధులు కలసికట్టుగా దాడి చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు, నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల నీటితోపాటు కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కలుషితం అవుతాయి. దీనితో టైఫాయిడ్, డయేరియా, కలరా, మలేరియా వంటివి ప్రబలే అవకాశం ఉందని, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఎడతెరిపి లేని వానలతో ఉష్ణోగ్రతలు తగ్గి వైర్‌సలు, బ్యాక్టీరియాలు విజృంభిస్తాయని.. జలుబు, ఫ్లూ, న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు రావొచ్చని వివరిస్తున్నారు. వర్షాలతో ఎక్కడిక్కడ నీళ్లు నిలిచి ఉండటంతో దోమలు, కీటకాల ఉధృతి పెరిగి.. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా విజృంభించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. రహదారులపై కలుషిత నీటిలో నడవడం వల్ల చర్మ సమస్యలూ వస్తాయని హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల రోజులు జాగ్రత్తగా ఉండాలని.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఎక్కడ నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో భారీగా ఓపీ నమోదు
ఆగస్టులో శుక్రవారం నాటికి ప్రభుత్వ ఏరియా, కమ్యూనిటీ, బోధనాస్పత్రుల్లో 12.91 లక్షల ఓపీ నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 44,537 మంది ఆస్పత్రులకు వస్తున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో కలిపి 26,88,108 ఓపీ నమోదైంది. విషజ్వరాలతో వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
బస్తీ, కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి
వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఆహారం, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, ఈ వంటివి సోకే అవకాశాలు ఎక్కువ. జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణాలు, బస్తీ, కాలనీల్లో అంటు వ్యాధులు త్వరగా ప్రబలే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం వైరల్ జ్వరాల తీవ్రత కనిపిస్తోంది. ఈ పరిస్థితి కొన్నిరోజుల పాటు ఉంటుంది. మూడు రోజులకు మించి జ్వరం కొనసాగితే తక్షణమే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలి. సొంత వైద్యంతో పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది.
- డాక్టర్ రాజారావు, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
వేర్వేరు వ్యాధులు కలిసి వస్తున్నాయి
భారీ వర్షాలు, వరదల తర్వాత అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తాజా ఆహారం తీసుకోవాలి, కాచి వడగట్టిన మంచినీరే తాగాలి. ఇష్టారాజ్యంగా యాంటీ బయాటిక్స్ వేసుకోవద్దు. వైరల్ జ్వరాలకు యాంటీ బయాటిక్స్ పనిచేయవు. జ్వరాలు ఎక్కువ రోజులు ఉంటే వైద్యుల సలహాతో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒళ్లునొప్పులు ఉన్నాయని పెయిన్స్ కిల్లర్స్ ఇష్టమొచ్చినట్టు వాడొద్దు. వాటితో రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సమయంలో సోకుతున్నాయి. పరిశుభ్రత, కొద్దిపాటి జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో నిల్వ నీటి తొలగింపు, క్లోరినేషన్ వంటి చర్యలు చేపట్టాలి. నీటి పైపుల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాలి.
- డాక్టర్ ఎంవీరావు, కన్సల్టెంట్ ఫిజీషియన్, యశోద ఆస్పత్రి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..