Weight Loss: బరువు తగ్గలేదు కదా.. ఆ ఫీజు వెనక్కివ్వండి
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:57 AM
బరువు తగ్గింపు చికిత్స సఫలం కాకపోవడంతో వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఓ సంస్థను ఆదేశించింది.

కలర్స్ హెల్త్‌కేర్‌కు రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బరువు తగ్గింపు చికిత్స సఫలం కాకపోవడంతో వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఓ సంస్థను ఆదేశించింది. ‘వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్’ పేరుతో వసూలు చేసిన రూ.1.05 లక్షల ఫీజు, దానిపై 9% వడ్డీతోపాటు రూ.50 వేల పరిహారం చెల్లించాలన్న జిల్లా ఫోరం తీర్పును సమర్థించింది. ఎద్దుమైలారం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని అధిక బరువు తగ్గించుకునేందుకు 2022 ఏప్రిల్‌లో కలర్స్ హెల్త్‌కేర్ ఇండియాను ఆశ్రయించింది. ఆ సంస్థ నిపుణులు క్రిప్టో ట్రీట్‌మెంట్ ద్వారా 20 కిలోల వరకు బరువు తగ్గవచ్చని చెప్పారు. వెంటనే రూ.50 వేలు చెల్లించిన ఆ విద్యార్థిని 8 నెలల పాటు చికిత్స తీసుకుంది.
చికిత్స తీసుకుంటున్న సమయంలో మరో రూ.55 వేలు చెల్లించింది. చికిత్స తీసుకున్న తర్వాత కూడా బరువులో మార్పులేకపోవడంతోపాటు, ఆ సంస్థ డైటీషియన్‌లు, వైద్యులు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. తనకు జరిగిన సేవాలోపానికి పరిహారం కోరుతో మెదక్ జిల్లా పోరంలో ఫిర్యాదు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా ఫోరం చికిత్స పేరుతో వసూలు చేసిన రూ.1.05 లక్షలు, దానిపై 9ు వడ్డీ, రూ.50 వేల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రతినిధులు రాష్ట్ర పోరాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ఫోరం ఇన్‌ఛార్జ్ అధ్యక్షుడు మీనా రంగనాథన్, సభ్యుడు వి.వి. శేషుబాబుల ధర్మాసనం కలర్స్ హెల్త్‌కేర్ అప్పీలును కొట్టివేసింది. పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.